ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండో రోజు… కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలు దాటింది. గత ఇరవై నాలుగు గంటల్లో 10,167 కేసులు నమోదయినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్క కోరనా వల్ల ఏపీలో చనిపోయిన వారి సంఖ్య 1281కి చేరింది. తూర్పుగోదావరి, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్క రోజు కేసులు వెయ్యి దాటిపోయాయి. మిగతా జిల్లాల్లోనూ భారీగా నమోదయ్యాయి. కోలుకునే వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంటోంది. ఒక్క రోజులో 4618 మందిని డిశ్చార్జ్ చేసినట్లుగా ప్రకటించారు.
టెస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా ఉంటోంది. రోజుకు 70వేల వరకూ టెస్టులు చేస్తోంది. యాంటీజెన్ టెస్టులు ఇందులో ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇతర పద్దతుల్లోనూ.. టెస్టులు 30వేలకుపైగా చేస్తున్నారు. అయితే.. పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూండటం.. కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఏర్పడటం మాత్రం.. అధికారవర్గాలను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. సామాజిక వ్యాప్తి అయితే.. ఇలా కేసులు నమోదవుతాయన్న అంచనా ఉంది. ప్రస్తుతం 70వేలకు కొంచెం తక్కువగా యాక్టివ్ కేసులు ఏపీలో ఉన్నాయి. దేశంలో ఇంత స్థాయిలో యాక్టివ్ కేసులు ఉన్న టాప్ త్రీ రాష్ట్రాల్లో ఏపీ ఒకటి.
వరుసగా పెరుగుతున్న కేసుల కారణంగా.. వైద్య సౌకర్యాలు కూడా సరిపోవడం లేదు. ఈ కారణంగానే సీరియస్ అవుతున్న రోగులకు అత్యవసర వైద్యం అందక… కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వందలు, వేల పడకలతో… కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్న అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తోంది. టెస్టులు చేయడం కన్నా.. అసలు కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం..ప్రజల్ని మరింత అసహనానికి గురి చేస్తోంది.