జనవరిలో అమ్మఒడి ఎవరికీ ఇవ్వడం లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 75 శాతం హాజరు ఉంటే జూన్‌లో ఇవ్వాలని మంత్రివర్గ సమావేసంలోనే నిర్ణయించారు. అంటే జనవరిలో రూ. ఆరు వేల కోట్ల వరకూ నిధులు సేకరించి అవసరం తప్పిపోయినట్లయింది. మళ్లీ జూన్‌కు వచ్చే సరికి కొత్త ఆర్థిక సంవత్సవరం వస్తుంది కాబట్టి అప్పుడు కొత్త అప్పుల ద్వారా పథకాన్ని అమలు చేయవచ్చు. అయితే అప్పటికి విద్యాసంవత్సరం మారుతుంది. అంటే ఓ ఏడాది ఎగ్గొట్టినట్లేనని భావిస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో మరికొన్ని పాత నిర్ణయాలను కూడా కొత్తగా తీసుకున్నారు.
విశాఖలో 130 ఎకరాలను అదాని డేటా సెంటర్ కు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్ని నాని ప్రకటించారు. అయితే ఇది గత ఏడాది నవంబర్‌లో జరిగిన కేబినెట్ భేటీలోనే తీసుకున్నారు. ఆ నిర్ణయం తర్వాత విజయసాయిరెడ్డి అహ్మదాబాద్ వెళ్లి అదానీని కలిసి కేబినెట్ నిర్ణయం గురించి చెప్పి వచ్చారు. కానీ అదానీ కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఏడాది తర్వాత మళ్లీ ఇప్పుడు కేటాయింపులు చేస్తూ మళ్లీ నిర్ణయం తీసుకున్నారు. ఇక రెండురోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే శారదాపీఠానికి పదిహేను ఎకరాలను కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 17 నుంచి నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన కేిబనెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంస్థ నుంచి యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 25 ఏళ్ల పాటు పీపీఏ చేసుకోవాలని నిర్ణయించారు. అలాగే కొంత కాలంగా చర్చనీయాంశం అవుతున్న సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఇక ఏపీలో సినిమా టిక్కెట్లు ప్రభుత్వ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అమ్ముతారు.