గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నారనే సామెత ఉంది. అంటే దొంగ అని తేల్చకముందే.. వారికి వారు బయటపడటం అన్నమాట. ఇప్పుడు ఆరుగురు కర్ణాటక మంత్రులకు ఖచ్చితంగా ఇదే సరిపోయేలా ఉంది. రమేష్ జార్కిహోళి అనే మంత్రి… ఓ యువతిని ఉద్యోగం పేరుతో లోబర్చుకున్న వ్యవహారం వీడియో సీడీలతో సహా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. ఈ వీడియోలను బయట పెట్టిన సామాజిక కార్యకర్త… తమ వద్ద ఇంకా పలువురు మంత్రుల సీడీలు ఉన్నాయని.. వరుసగా బయటపెడతానని ప్రకటించారు. దీంతో ఉలిక్కి పడిన ఆరుగురు మంత్రులు… వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. తమపై అభ్యంతరకమైన వార్తలు ప్రసారం చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. హైకోర్టు వీరి ఆందోళనను అర్థం చేసుకుని ఆ మేరకు ఆర్డర్ ఇచ్చింది.
రమేష్ జార్కిహోళి వీడియోబయటకు వచ్చింది. ఆయన పదవి నుంచి వైదలొగడానికి ముందుగా ఒప్పుకోకపోయినా.. యడ్యూరప్ప బలవతంగా అంగీకరింప చేశారు. అయితే తాను సైలెంట్ గా ఉండనని.. మిగతా మంత్రుల బాగోతం బయటపెడతానని.. జార్కిహోళి బ్రదర్స్ బెదిరించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన ఎవరికీ అందుబాటులో లేరు. కానీ.. ఆరుగురు మంత్రుల సీడీలు బయటకు రాబోతున్నాయన్న ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో ఊపందుకుంది. కొంత మంది ఫేక్ ప్రచాాలు చేస్తున్నారు. మరికొంత మంది అదిగో పులి అంటే… ఇదిగో తోక అన్నట్లు సంబంధం లేని వీడియోలను చూపిస్తే.. వీరు మంత్రులేనా అంటూ ఉత్కంఠ రేపుతున్నారు.
తమపై వార్తలొద్దని హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ఆరుగురు మంత్రుల సీడీలు ఉన్నట్లుగా ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. వారిపై అనుమానపు చూపులు చూస్తున్నారు. ఈ పోర్న్ వీడియోలు.. కర్ణాటక బీజేపీ సర్కార్కు గండంగా మారాయి. తమ మంత్రుల్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక.. బీజేపీ పెద్దలు కంగారు పడుతున్నారు. అసలు ఈ సీడీలు ఎలాబయటకు వెళ్తున్నాయో.. ఎవరు స్పైయింగ్ చేస్తున్నారో తెలియక మరికొంత మంది కంగారు పడుతున్నారు. మొత్తానికి కర్ణాటకలో మాత్రం… యడ్యూరప్ప సర్కార్కు సీడీలు చాలా కష్టాలు తెచ్చి పెడుతున్నాయి.