పోలవరంపై.. తెలంగాణ సర్కార్ మరోసారి… సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరాన్ని ఆపాలంటూ సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్.. ఇప్పటికే విచారణలో ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి వేసిన పిటిషన్‌కు అనుబంధంగా అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే… పోలవరం ప్రాజెక్టుకు అన్ని పర్యావరణ అనుమతులు వచ్చాయి. అయినప్పటికీ.. అప్పట్లో 36 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద ముంపు అంచనాతో.. 2005లో పోలవరానికి కేంద్రం పర్యావరణ అనుమతులు ఇచ్చారని.. ఆ తర్వాత డిజైన్ మార్పు చేశారని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.
డిజైన్ మార్పుతో ముంపు ప్రభావం 50 లక్షల క్యూసెక్కులకు చేరిందని.. మరోసారి పర్యావరణ అనుమతులు ఇచ్చే ముందు.. వరద ముంపు ప్రభావాన్ని అంచనా వేయాలని అఫిడవిట్ దాఖలు చేసింది. మరోసారి పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేసి.. ఆ తర్వాతే పోలవరానికి కేంద్రం అనుమతులు ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. పైగా.. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి ఏపీ గోదావరి నీటిని వినియోగించుకుంటోందని.. తమ వాటాగా 19 టీఎంసీలు అదనంగా వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని..కూడా కోరింది. వృధాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే… ఏపీ వాడుకుంటోంది. అయినప్పటికీ.. తెలంగాణ సర్కార్ ఇందులోనూ వాటా అడుగుతోంది.
అసలు పోలవరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమే.. పట్టిసీమ అని కేంద్ర జలవనరుల శాఖ గతంలోనే నిర్ధారించింది. పైగా.. విభజన చట్టంలో .. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతుల వచ్చినట్లుగా భావించాలన్న క్లాజ్ ఉంది. అయినప్పటికీ.. తెలంగాణ సర్కార్ కావాలనే.. ఇలా పిటిషన్లు వేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికే అరవై శాతం పూర్తయింది.. ఈ సమయంలో.. ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే పిటిషన్లు వేస్తున్నట్లు ఏపీ రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి.