హైదరాబాద్: మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, మనవళ్ళ సజీవ దహనం కేసులో రాజయ్య కొడుకు అనిల్ రెండో భార్య సన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె పరారీలో ఉందని వరంగల్ పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను పంపామని తెలిపారు. సారిక, ఆమె కుమారుల అనుమానాస్పద మృతిలో సనాకూడా నిందితురాలు. గతంలోకూడా సనపై సారిక హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిఉంది. ప్రమాదంలో సన పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె పేరునుకూడా తాజా కేసు ఎఫ్ఐఆర్లో చేర్చారు.
మరోవైపు రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు రాజయ్యలను పోలీసులు నిన్న కోర్ట్‌లో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దానితో వారు ముగ్గురినీ వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే సారిక, ఆమె పిల్లల పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు పోలీసులకు అందజేశారు. వారు సజీవంగానే దహనమైనట్లు నివేదికలో పేర్కొన్నారు. వారి ఊపిరితిత్తులలో పొగచూరి ఉన్నాయని తెలిపారు. మంటల వేడికి నలుగురి ఎముకలు విరిగిపోయాయని పేర్కొన్నారు.
సారిక, ఆమె పిల్లల అంత్యక్రియలు నిన్న సాయంత్రం వరంగల్‌లో ముగిశాయి. పోస్ట్ మార్టమ్ పూర్తయిన తర్వాత మృతదేహాలను ఊరేగింపుగా శ్మశానవాటికకు తరలించారు. మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. రాజయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. రాజయ్య కుటుంబమంతా జైలులో ఉండటంతో పుట్టింటివారి తరపున విశ్వబ్రాహ్మణసంఘం ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి. సారికకు నిప్పుపెట్టిన ఆమె తల్లి, తన బిడ్డను చిత్రహింసలు పెట్టి చంపారని, రాజయ్య కుటుంబాన్ని చంపేయాలని అన్నారు. మరోవైపు నిన్న వరంగల్ చేరుకున్న మందకృష్ణ మాదిగ, రాజయ్య కుటుంబానిది తప్పు ఉండకపోవచ్చన్నట్లుగా మాట్లాడటం విశేషం!