ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈడీ కోర్టులోనూ చుక్కెదురు అయింది. ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చేందుకు ఈడీ కోర్టు కూడా నిరాకరించింది. సీబీఐ కేసుల్లో జగన్కు..ఈ తీర్పు గతంలోనే ఎదురొచ్చింది. కనీసం ఈడీ కేసుల్లో అయినా తనకు ఊరట లభిస్తుందని జగన్ ఆశించారు. కానీ.. ఈడీ కోర్టు కూడా.. రావాలి జగన్ అనే తీర్పునే ఇచ్చింది. క్విడ్ ప్రో కో కింద భారీగా అక్రమాస్తులను కూడ బెట్టినట్లుగా సీబీఐ కేసు నమోదు చేసినప్పుడు.. ఈ అక్రమాస్తుల లావాదేవీలన్నీ… మనీలాండరింగ్ ద్వారా జరిగాయని.. తేల్చింది.
విదేశాల నుంచి అక్రమంగా నిధులు తరలించడం.. మళ్లించడం వంటి వ్యవహారాలకు పాల్పడినట్లుగా సీబీఐ స్పష్టమైన డాక్యుమెంట్లు ఇవ్వడంతో .. సీబీఐతో పాటు సమాంతరంగా ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు.. ఈ కేసుల్లో నిందితులకు చెందిన ఆస్తులను అటాచ్ కూడా చేసింది ఈడీ. ఈ కేసు విచారణ కూడా.. సీబీఐ కోర్టులో సమాంతరంగా సాగుతోంది. ఈడీ కేసులపై జగన్ అనేక సార్లు.. అనేక పిటిషన్లు వేశారు. సీబీఐ విచారణ పూర్తయిన తర్వాతే ఈడీ విచారణ చేయాలని కూడా వాదించారు. కానీ.. కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. సీబీఐ కేసులతో పాటే ఈడీ కేసులు కూడా సమాంతరంగా విచారణ జరగనున్నాయి.
అలాగే.. జగన్మోహన్ రెడ్డి ప్రతీ శుక్రవారం.. ఈడీ కేసుల్లోనూ హాజరు వేయించుకోవాల్సి ఉంది. అయితే.. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్.. కోర్టుకు డుమ్మా కొట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సీబీఐ కోర్టు సీరియస్ అవ్వడంతో ఒక్కసారి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత ప్రతీ వారం ఆబ్సెంట్ పిటిషన్లు వేస్తున్నారు. ఇక నుంచి .. ఈడీ కోర్టులోనూ.. ఇలా ఆబ్సెంట్ పిటిషన్లు వేయాల్సిన పరిస్థితి.