టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ మీద … అలంద మీడియా కంపెనీ డైరక్టర్ మరో ఫిర్యాదు చేశారు. దాని మేరకు.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదు సారాంశం..” టీవీ9కి చెందిన లోగోలన్నింటినీ.. రూ. 99వేలకు మోజో టీవీ ఎండీ హరికిరణ్‌కు అమ్మేయడం..”. కేసు పెట్టిన అలంద మీడియా సంస్థ డైరక్టర్ కౌశిక్ రావు చెప్పిన దాని ప్రకారం… టీవీ9 లోగోలన్నీ ఇప్పుడు… నెక్ట్స్ ఇండియా కంపెనీకి చెందినవి. ఆ లోగోలకు సంబంధించి రూ. 99వేల రూపాయలను… కూడా.. ఆ సంస్థ.. ఏబీసీఎల్కు చెల్లించింది. ఇది రికార్డుల్లో కూడా నమోదయింది. ఫిబ్రవరి 28వ తేదీన కంపెనీ బుక్స్‌లో కూడా దీన్ని నమోదు చేశారు.
టీవీ9, న్యూస్9 లోగోలను అమ్మేసిన రవిప్రకాష్..!
తమ కంపెనీ లోగోలు కోట్ల రూపాయల విలువైనవని.. వాటాదారులందరికీ తీవ్రమైన నష్టం కలిగేలా.. లోగోలను అక్రమంగా దురుద్దేశపూర్వకంగా రవిప్రకాష్ బదిలీ చేశారని.. కౌశిక్ రావు ఆరోపిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలను తీసుకున్నప్పుడు మెజార్టీ వాటాదారులకు సమాచారం ఇవ్వాలని నిబంధన పాటించలేదని.. కౌశిక్ రావు ఆరోపిస్తున్నారు. రవిప్రకాష్ పై కౌశిక్ రావు చేసిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ పత్రాలను తెలుగు360 సేకరించింది. అందులో మొత్తం ఆరు లోగోలకు సంబంధించిన లావాదేవీలు జరిగాయని.. కౌశిక్ రావు చెబుతున్నారు. అంతా కుట్ర పూరితంగా చేశారని.. ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఫోర్జరీతో పాటు డేటా చోరీ కేసులు పెట్టిన కౌశిక్ రావు.. రవిప్రకాష్ పై చేసిన మరో ఫిర్యాదు ఇది. రవిప్రకాష్ ను సీఈవో పదవి నుంచి తొలగించిన తర్వాత.. అన్ని వ్యవహారాలను పరిశీలించిన టీవీ9 కొత్త యాజమాన్యానికి చాలా షాకులు తగులుతున్నట్లుగా తెలుస్తోంది. ఏ చిన్న అవకతవక కనిపించినా.. ముందుగా.. పోలీసు కేసు పెట్టేందుకు కౌశిక్ రావు రెడీ అయిపోతున్నారు. ముందు ముందు ఈ కోణంలో మరిన్ని కేసులు నమోదైనా ఆశ్చర్యం లేదంటున్నారు.
టీవీ9 లోగోను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందా..?
కౌశిక్ రావు ఫిర్యాదు.. అందులోని వివరాలు చూస్తే.. టీవీ9 లోగో అమ్మకం విషయంలో.. రవిప్రకాష్‌పై కేసు పెట్టవచ్చు కానీ.. కోర్టులో ఆ లోగోలను టీవీ9 సంస్థ కాపాడుకోవడం అంత తేలిక కాదన్న అభిప్రాయం కార్పొరేట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే… టీవీ9 సీఈవోగా.. సంపూర్ణమైన అధికారాలతోనే రవిప్రకాష్… లోగోలను .. హరికిరణ్‌కు అమ్మేసినట్లు.. కౌశిక్ రావు… ఫిర్యాదు ద్వారా తెలుస్తోంది. కౌశిక్ రావు ప్రధాన అభ్యంతరం… ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు…వాటా దారులందరికీ తెలియచేయాలనడమే. తెలియచేయలేదు కాబట్టి కుట్ర జరిగిందని అంటున్నారు. ఇది పూర్తిగా అంతర్గత వ్యవహారం అవుతుంది. కొనుగోలు చేసిన వ్యక్తి… తనకు అమ్మే వ్యక్తికి హక్కులు ఉన్నాయా లేదా అన్నదే చూస్తారు. హరికిరణ్… రవిప్రకాష్‌కు హక్కులు ఉన్నాయని భావించి కొనుగోలు చేస్తే.. ఆ విషయాన్ని కోర్టులో నిరూపిస్తే… ఒప్పందం అమలయ్యే అవకాశం ఉంది. టీవీ9కి ఆ లోగో దూరమయ్యే అవకాశం ఉంటుందని.. పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
వ్యవస్థాపకుడైన రవిప్రకాష్‌కు.. లోగోపై సంపూర్ణ హక్కులున్నాయా..?
అయితే రవిప్రకాష్ .. ఏ ఉద్దేశంతో లోగోలు అమ్మేశారన్నది… మీడియాతో పాటు కార్పొరేట్ వర్గాల్లోనూ ఆసక్తి కలిగిస్తోంది. లోగోలపై.. రవిప్రకాష్‌కు సంపూర్ణ హక్కులు ఉన్నాయన్న ఓ వాదన.. కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఎందుకంటే.. రవిప్రకాష్… సంస్థ వ్యవస్థాపక సభ్యుడు. వెంచర్ క్యాపిటలిస్ట్ అయిన శ్రీనిరాజు.. మొదట్లో పెట్టుబడి మాత్రమే పెట్టారు. ఆ సందర్భంగా చేసుకున్న అగ్రిమెంట్లలో మేథోపరమైన అంశాలపై.. అంటే.. లోగోల్లాంటివి.. తనకే హక్కులు ఉండేటట్లుగా… రవిప్రకాష్ ఒప్పందం చేసుకుని ఉంటారని… ఆ ప్రకారమే.. లోగోలను అమ్మేసి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత వివాదాలపై రవిప్రకాష్ ఇంకా తన వెర్షన్ వినిపించలేదు. ఆయన ఆజ్ఞాతంలో ఉన్నారని… తెలంగాణ పోలీసులు చెబుతున్నారు కానీ.. మీడియాకు ఇంటర్యూలు ఇస్తూనే ఉన్నారు. కానీ కేసుల గురించి పెద్దగా మాట్లాడటం లేదు.