మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్తపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అటు ఆళ్లగడ్డలో.. ఇటు హైదరాబాద్‌లోనూ ఈ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో నమోదయిన కేసులో స్వయంగా ఏపీ పోలీసులే ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం.. ఆళ్లగడ్డలో ఓ స్టోన్ క్రషర్ బిజినెస్ వ్యవహారంలో.., అఖిలప్రియ భర్త భార్గవరామ్ బెదిరించాడంటూ.. కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ప్రశ్నిస్తామంటూ… ఆళ్లగడ్డ ఎస్ఐ.. హైదరాబాద్ వచ్చారు. గచ్చిబౌలిలో… భార్గవరామ్ ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లారు. అయితే.. భార్గవరామ్.. తనకు సహకరించకుండా కారును తన మీదకు ఎక్కించేలా రాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లిపోయారని.. ఆళ్లగడ్డ ఎస్ఐ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనపై కేసు నమోదయింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే పేరుతో ఈ కేసు నమోదు చేశారు.
భూమా అఖిలప్రియ టార్గెట్‌గా కొన్నాళ్లుగా.. ఆళ్లగడ్డలో రాజకీయం నడుస్తోందనే ప్రచారం జరుగుతోంది. మొదట ఆమె బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం చేశారు. తర్వాత వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం చేశారు. అయితే అఖిలప్రియ మాత్రం.. చాలా దూకుడుగా టీడీపీ తరపున .. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాటలతో కాకుండా చేతలతోనే… తాను టీడీపీలోనే కొనసాగుతానని చెబుతున్నారు. ఈ క్రమంలో అఖిలప్రియపై ఒత్తిడి పెంచేందుకు ఈ కేసుల వ్యవహారం తెరపైకి వస్తోందని.. ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్‌లో అఖిలప్రియ భర్త భార్గవరామ్ పై నమోదు చేసిన కేసే.. ఆమెపై ఒత్తిడి పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని నిరూపిస్తోందని… అంటున్నారు. భార్గవరామ్‌పై కేసు నమోదయితే.. పోలీసులు స్టేషన్‌కు పిలిపిస్తారు. రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటారు. కానీ.. దసరా పండుగ రోజు… ఆళ్లగడ్డ ఎస్ఐ… భార్గవరామ్ కోసం.. హైదరాబాద్ రావడం… గచ్చిబౌలిలో రాష్‌గా ప్రవర్తించారంటూ కేసు పెట్టడం… కావాలని చేస్తున్నట్లుగానే ఉందంటున్నారు.