మాజీ మంత్రి విడదల రజనీకి కేసులు వదలడం లేదు. తాజాగా ఇవాళ మరో ఫిర్యాదుపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విడుదల రజనీ మంత్రిగా ఉన్న సమయంలో ఆమె బావమరిది గోపితో పాటు టౌన్ ప్లానర్ తో కలిసి పద్దెనిమిది భారీ భవనాలకు అక్రమంగా లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చారని మల్లెల శివనాగేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే కలెక్టర్ విచారణ చేయించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. మల్లెల శివనాగేశ్వరరావు ఇచ్చిన వివరాలపై ఆ భవనాల ప్లాన్లను బయటకు తీసి.. అక్రమంగా అనుమతులు ఇచ్చారో లేదో తేల్చనున్నారు.
ఇప్పటికే ఆ భవనాల అనుమతులు అక్రమంగా తీసుకున్నారని చిలకలూరిపేటలో గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న రజనీ కుటుంబసభ్యులు చేసిన దందాల్లో ఈ భవన నిర్మాణ అనుమతులు కూడా ఒకటి అని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారిపోగానే.. రజనీ బావమరిది గోపీ పారిపోయారు. ఆయన జర్మనీలో ఉంటారని.. జర్మనీ పౌరుడని రజనీ చెబుతున్నారు. అయినా కేసులు పెడుతున్నారని అంటున్నారు. నిజానికి ఆ జర్మనీ పౌరుడు.. ఐదేళ్ల పాటు చిలకలూరిపేటలో దందాలకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారన్న విషయాన్ని మాత్రం దాచేందుకు రజనీ ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో.. ముందస్తు బెయిల్ కోసం .. అరెస్టు చేయకుండా చూసుకునేందుకు విడుదల రజనీ ప్రయత్నిస్తున్నారు. న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునేందుకు పోలీసులు అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సాక్ష్యాలు పక్కాగా ఉండటంతో రజనీ జైలుకు వెళ్లక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఆమె బాధితులు పదుల సంఖ్యలో బయటకు వస్తూండటంతో ఒక్క సారి పదవి వచ్చినందుకు ఇంత దోపిడీ చేశారా అని ప్రజలు కూడా ఆశ్చర్య పోయే పరిస్థితి కనిపిస్తోంది.