ఏపీ నుంచి సీబీఐ విచారణ జరుపుతున్న కేసుల్లో మరొకటి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే డాక్టర్ సుధాకర్ కేసు.. న్యాయమూర్తులపై దూషణల కేసు.. వివేకానందరెడ్డి హత్య కేసు.. అలాగే అయేషా మీరా కేసు వంటి వాటిని సీబీఐ విచారణ జరుపుతోంది. తాజాగా నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ అంశంపైనా సీబీఐ విచారణ చేయించే అంశంపై తగిన ఆదేశాలిస్తామని హైకోర్టు తెలిపింది. జిల్లా జడ్జిన ఇచ్చి నివేదిక మేరకు పోలీసులు ఈ కేసులో సీరియస్గా వ్యవహరించలేదని నిర్లక్ష్యంగా దర్యాప్తు చేశారని తేలింది.
అనేక లూప్ హోల్స్ బయటపడటంతో సీబీఐ దర్యాప్తు చేయించాలని కోర్టుకు విజ్ఞప్తులు అందాయి. ప్రభుత్వం కూడా సీబీఐ విచారణ జరిపిస్తే అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో కోర్టు నిర్ణయం ప్రకటించనుంది. మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే.. కోర్టులో చోరీ జరిగింది. కాకాణి గతంలో మంత్రి సోమిరెడ్డిపై తప్పుడు .. ఫోర్జరీ డాక్యుమెంట్లతో చేసిన ఆరోపణల కేసులో సాక్ష్యాలన్నీ తీసుకెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు.
కానీ సాక్ష్యాలు పోలీస్ స్టేషన్లో ఉండాలన్న వాదన వినిపించింది. ఇలా రకరకాలుగా ఈ కేసు వ్యవహారం మలుపులు తిరిగింది. దొంగలను పట్టుకున్న పోలీసులు .. కుక్క కథ చెప్పడంతో మరింత అనుమానాలు ప్రారంభమయ్యాయి. దీని వెనుక కేసులేమిటో తేల్చాలన్న సూచనలు వస్తున్నాయి. చివరికి హైకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో కానీ.. ఈ కేసు ముందు ముందు సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.