బాలీవుడ్ వాళ్లకు మన తెలుగు కథలపై ఈమధ్య మరింతగా మమకారం పెరిగింది. `అర్జున్ రెడ్డి`ని `కబీర్ సింగ్` గా ఆదరించారు, కోట్లు కురిపించారు. అందుకే తెలుగు కథలకు ఈస్థాయి గిరాకీ. ఇటీవల చాలా తెలుగు కథలు బాలీవుడ్ కి వెళ్లాయి. వెళ్తున్నాయి. అయితే ఫలితాలన్నీ `అర్జున్ రెడ్డి`లా ఎందుకుంటాయి..? వరుసగా ఫ్లాపులు తగులుతున్నాయి. ఇటీవల `ప్రస్థానం`, `కాంచన` సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలూ అట్టర్‌ఫ్లాప్. ఇప్పుడు ఈ జాబితాలో మరో సినిమా చేరిపోయింది. అదే.. `భాగమతి`.
అనుష్క ప్రధాన పాత్ర పోషించిన చిత్రం `భాగమతి`. అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ తెరకెక్కించింది. ఈ సినిమా హిందీలో `దుర్గామతి`గా రీమేక్ చేశారు. అశోక్ నే దర్శకుడు. ఈవారమే ఓటీటీ వేదికగా విడుదలై.. ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. తెలుగునాట అనుష్క చేసిన మ్యాజిక్ బాలీవుడ్ లో భూమి పట్నాకర్ చేయలేకపోయింది. అనుష్క ఇమేజ్ `భాగమతి`కి ప్లస్ అయ్యింది. బాలీవుడ్ లో భూమికి అంత ఇమేజ్ లేదు. పైగా… టేకింగ్ పరంగా అశోక్ ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయాడు. అందుకే… `దుర్గామతి` తేలిపోయింది. ఈ ఫ్లాపుతో… బాలీవుడ్ గడ్డపై పరాజయం మూగట్టుకున్న తెలుగు దర్శకుల జాబితాలో.. అశోక్ పేరు కూడా వెళ్లిపోయినట్టైంది.