రెండు నెలల కిందట అరెస్ట్ చేసిన చింతమనేని ప్రభాకర్‌ను బయటకు రాకుండా పోలీసులు కేసుల మీద కేసులు పెడుతున్నారు. అన్నీ ఒకే సారి కాకుండా.. ఒక కేసులో రిమాండ్ పూర్తయితే.. బెయిల్ వస్తుందని క్లారిటీ వస్తే.. ఆ వెంటనే.. మరో కేసు పెట్టి.. పీటీ వారెంట్‌పై మరోసారి అరెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకూ.. దాదాపుగా ఇరవైకిపైగా కేసులు పెట్టిన పోలీసులు తాజాగా… మరో నాలుగు కేసులు పెట్టారు. మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో..నాలుగు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. పీటీ వారెంట్‌పై ఏలూరు జిల్లా జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ విధించడంతో… మళ్లీ జైలుకు తరలించారు.
వైసీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత.. టీడీపీ నేతలు చాలా మందిపై కేసులు పెట్టారు కానీ.. చింతమనేనిని మాత్రం.. డెడ్లీగా టార్గెట్ చేశారు. స్వయంగా ఎస్పీనే.. చింతమనేని ప్రభాకర్ పై … ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని పిలుపునిచ్చారు. దీంతో.. వైసీపీ నేతలు.. ఒక్కొక్కర్ని తీసుకొచ్చి ఫిర్యాదులిప్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర కేసుల్లో అయితే అరెస్ట్ చూపడం సాధ్యం కాదు కాబట్టి… స్టేషన్ బెయిల్ కు అవకాశం లేని ఎస్సీ, ఎస్టీ కేసులే ఎక్కువగా నమోదు చేస్తున్నారు. సాక్ష్యాలున్నాయా.. విచారణ జరిగిందా.. అన్నది తర్వాత సంగతి… ప్రస్తుతానికి చింతమనేనిని జైల్లోనే ఉంచాలన్నట్లుగా.. పోలీసుల వ్యవహారశైలి ఉందని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చింతమనేనిని నారా లోకేష్ సహా… టీడీపీ ముఖ్యమనేతంలదరూ పరామర్శించారు. ఇప్పటికీ.. వారానికొకరు చొప్పున జైలుకి వెళ్లి చింతమనేనికి ధైర్యం చెప్పి వస్తున్నారు. ఇంటికి వెళ్లికి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు కేసులతో వేధించేవారికి వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయినా పోలీసులు చింతమనేనిని మాత్రం వదిలి పెట్టడానికి సిద్ధంగా లేరు.