ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఎవరి అండ దండలపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడి.. స్టార్ గా మారాడు రవితేజ. తాను నిలదొక్కుకోవడమే కాదు.. తమ్ముళ్లు భరత్, రఘులకు కూడా ఓ మార్గం వేశాడు. రవితేజ తనయుడు మహాజన్ కీ నటనపై ఆసక్తి ఉంది. తండ్రితో కలిసి ఓ సినిమాలో నటించాడు కూడా. త్వరలో తాను హీరోగా అవతారం ఎత్తే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే అంతకంటే ముందే రవితేజ ఇంటి నుంచి మరో హీరో వస్తున్నాడు. తనే… మాధవ్. రవితేజ తమ్ముడు రఘ తనయుడు. తన వయసు 21. హీరోకి కావల్సిన అన్ని లక్షణాలూ, అన్ని అర్హతలూ సంపాదించుకొన్నాడు. నటనలో శిక్షణ కూడా తీసుకొన్నాడు. ఇప్పుడు హీరోగా మారుతున్నాడు.
మాధవ్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్టు సిద్ధం అవుతోంది. ఇదో కొత్త తరహా ప్రేమ కథ అని తెలుస్తోంది. కథ ఇప్పటికే సిద్ధమైంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. మాధవ్ ఎంట్రీ బాధ్యత రవితేజ తీసుకొన్నారని, కథని ఆయనే ఓకే చేశారని, టెక్నీషియన్ల ఎంపిక విషయంలోనూ రవితేజ శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. మరో వారంలోగా.. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ కొత్త హీరో ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో తెలియాలంటే… ఇంకొన్ని రోజులు ఆగాలి.