అక్రమ నిర్బంధాల విషయంలో పోలీసులపై హైకోర్టు ఇటీవలి కాలంలో రెండు సార్లు తీవ్రంగా మండిపడింది. ఓ సారి నేరుగా డీజీపీని హైకోర్టుకు పిలిపించగా.. మరోసారి ఏకంగా సీబీఐ విచారణకే ఆదేశించింది. ఇలా జరుగుతున్నా పోలీసులు మాత్రం… తమ మార్క్ .. అరెస్టులు ఆపడం లేదు. తాజాగా.. అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్న జేఏసీకి చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు ప్రైవేటు వాహనంలో వచ్చి తీసుకెళ్లారు. వంశీకృష్ణ… అమరావతి జేఏసీకి సంబంధించిన రవాణా వ్యవహారాలు చూస్తున్నారు. ఆయనను పోలీసులు… నాలుగు రోజుల కిందట తీసుకెళ్లారు.
ఆయన కోసం.. అమరావతి జేఏసీ నేతలు.. అన్ని పోలీస్ స్టేషన్లను సంప్రదించినా.. తమకు తెలియదనే సమాధానం వచ్చింది. దాంతో.. అమరావతి జేఏసీ మీడియా సమావేశం పెట్టి.. వీడియో ఫుటేజీ విడుదల చేశారు. జేఏసీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ భవనంలో ఉన్న సీసీ కెమెరాలో… వంశీకృష్ణను మఫ్టీలో ఉన్న పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. వాహనం కూడా ప్రైవేటు వాహనం. పోలీసులు.. వంశీకృష్ణ సమాచారం కూడా ఇవ్వడం లేదని… ఉద్యమకారులను వేధిస్తున్నారని.. పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్తామని.. జేఏసీ కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు ప్రకటించారు.
ఉద్యమకారుల విషయంలో పోలీసులు ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా.. కీలకమైన కొంత మందిని టార్గెట్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో లాజిస్టిక్స్ చూసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమ వద్ద లేడని చెబుతూండటం కలకలం రేపుతోంది. వీడియో ఫుటేజీ స్పష్టంగా ఉండటంతో.. ఇదో వివాదం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అక్రమ నిర్బంధాల విషయంలో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టిన నేపధ్యంలో.. ఈ వంశీకృష్ణ అరెస్ట్ వ్యవహారం.. సంచలనం రేకెత్తిస్తోంది.