మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ వ్యవహారం మెల్లగా కల్వకుంట్ల కవిత వద్దకు చేరుతోంది. ఆమెతో సుఖేష్ చంద్రశేఖర్ జరిపిన వాట్సాప్ చాట్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. సుఖేష్ చంద్రశేఖర్ లాయర్ వీటిని బయట పెట్టినట్లుగా చెబుతున్నారు. అయితే సుఖేష్ కు సంబంధించిన సమస్త సమాచారం దర్యాప్తు సంస్థల వద్ద ఉంది. అలాంటప్పుడు సుఖేష్ లాయర్ ఎలా బయటపెడతారు..? దర్యాప్తు సంస్థలే ఇలా లీక్ చేయిస్తున్నాయని అనుమానిస్తున్నారు. ఎలా బయటకు వచ్చినా అందులో చాట్ మాత్రం స్పష్టంగా ఎమ్మెల్సీ కవిత నగదు అందుకున్నట్లుగా ఉంది.
చాట్‌లో సుకేష్ చంద్రశేకర్ కవితను అక్కా అని సుఖేష్ సంబోధించారు. ఆ చాట్ లో పదిహేను కిలోల నెయ్యి డెలివరీ చేసినట్లుగా ఉంది. ఈ చాట్‌లో పలు అంశాలు గతంలో సుకేష్ చంద్రశేఖర్ రాసిన లేఖలతో పోలి ఉంది. గతంలో రెండు సార్లు లేఖలను సుకేష్ తన లాయర్ ద్వారా విడుదల చేశారు. అందులో కేజ్రీవాల్ చెప్పినట్లుగా తాను రూ. పదిహేను కోట్లను.. హైదరాబాద్ బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద పార్క్ చేసిన కారులో ఉన్న ఏకే అనే వ్యక్తికి ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లు వరుసగా రిలీజ్ చేస్తానని కూడా ప్రకటించారు. ఆ ప్రకారం ఇప్పుడు కవితతో జరిగిన స్క్రీన్ షాట్లను లాయర్ బయటపెట్టడం రాజకీయంగానూ చర్చనీయాంశం అవుతోంది.
ఈ వ్యవహారం అంతా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిందేనని స్పష్టంగా తెలుస్తోంది. అయితే సుకేష్ చంద్రశేఖర్ అరెస్ట్ వ్యవహారం మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కాంలో కాదు. ఇతర కేసుల్లో. మరి సుఖేష్ నుంచి స్వాధీన చేసుకున్న ఫోన్.. కవిత ఇచ్చిన ఫోన్లలో ఈ వాట్సాప్ చాట్ బయటపడితే… ఏం జరుగుతుందో కానీ ఇప్పటికిప్పుడు ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు నోరు మెదపడం లేదు. ప్రస్తుతం కాలికి ఫ్రాక్చర్ కావడంతో కవిత బెడ్ రెస్ట్ లో ఉన్నారు.