మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్.. అందరికీ కోట్లకు కోట్లు ఎందుకిచ్చాడో ఎక్కడ్నుంచి తెచ్చిచ్చాడో తెలియదు కానీ.. ఆయన పేరుతో వస్తున్న లేఖలు మాత్రం హైలెట్ అవుతున్నాయి. అసలు జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఇంత డీటైల్డ్ గా లేఖలు రాసే స్వేచ్చ ఎలా పొందారు అన్న విషయం పక్కన పెడితే అందులో ఉండే విషయాలు మాత్రం కామెడీ అవుతున్నాయి. మొన్నే కేజ్రీవాల్ చెప్పాడని బీఆర్ఎస్ పార్టీకి రూ. పదిహేను కోట్లు ఇచ్చానని ఓ లేఖ రాశారు. త్వరలో వాట్సాప్ చాట్లు బయటపెడతానని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఆ వాట్సాప్ చాట్ల గురించి కాకుండా మరో రూ. పదిహేను కోట్లు ఇచ్చానని వాటిని అరుణ్ పిళ్లైకు ఇచ్చానని.. చెప్పుకొస్తూ మరో లేఖ విడుదల చేశారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచనతో తాను హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ఆఫీసులో ఆ పార్టీ నేతకు రూ.15 కోట్లు ఇచ్చానని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా బీఆర్ఎస్ లీడర్‌తో జరిగిన వాట్సాప్ చాట్‌ను కూడా లేఖలో ప్రస్తావించాడు. తనతో చాట్ చేసిన వ్యక్తి సౌత్ గ్రూప్‌లోని బీఆర్ఎస్ లీడర్ అని తెలిపాడు. రేంజ్ రోవర్ కారు నెం 6069 పార్క్ చేసి ఉందని సుఖేష్ అన్నాడు. ఆ కారుపై ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉందని చెప్పాడు. ఏపీ అంటే అరుణ్ పిళ్లై అని స్పష్టం చేశాడు.
అవసరమైతే తాను నార్కో టెస్ట్‌కు సిద్ధమని సుఖేష్ ప్రకటించాడు. ఇది టీజరేనని ..అసలైన బ్లాక్ బస్టర్ ముందుందని కేజ్రీవాల్‌ను సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో హెచ్చరించాడు. అసలు ఈ టీజర్లు ఎందుకు ఇస్తున్నాడు.. కేజ్రీవాల్, కేసీఆర్ లను ఎందుకు టార్గెట్ చేశాడు.. అసలు వారికి డబ్బులు ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ అంతుబట్టని విషయాలు. ఈయనతో లింకులున్నాయనే జాక్వలైన్ ఫెర్నాండెజ్ ను విచారణ చేస్తున్నారు. పలువురు బాలీవుడ్ తారలనూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి సుఖేష్ చేసిన నేరాన్ని నిరూపించాలనుకుంటే ఈడీకీ వారం పని . కానీ ఇలా విచారణ పేరుతో సాగ దీసి రాజకీయంగా ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టేలా లేఖలు విడుదల చేయండ కామెడీ అయిపోతుంది. రాను రాను ఈ సుఖేష్ వ్యవహారాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకునే పరిస్థితి లేకుండా పోతోంది.