తెలంగాణలో అధికారం పోతుందని కలలో కూడా ఊహించలేకపోయిన కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు వివిధ వర్గాల్లో తమ పట్టు కోల్పోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కవిత కోల్ బెల్ట్ లో రాజకీయాలు చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో స్వీప్ చేసింది. ఇప్పుడు అక్కడ సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కూడా తమ పార్టీ అనుబంధ సంఘం ఓడిపోతే ఇంకా గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ఆ అనుబంధ సంఘం ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పటి నుండి కవిత కనుసన్నల్లోనే నడుస్తోంది.
నిజానికి సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే జరగాల్సింది. కోర్టుకెళ్లి వాయిదా వేయించుకున్నారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎన్నికలు పెట్టాల్సి వస్తోంది. ఎన్నికల తేదీ దగ్గర పడటంతో కవిత.. టీబీజీకేఎస్ సంఘం నాయకులు, ముఖ్య కార్యకర్తలను హైదరాబాద్ పిలిపించుకుని మాట్లాడారు. అధికారం పోయింది కాబట్టి ఇంకేమీ హామీలు ఇస్తారని.. అధికారం ఉన్నప్పుడు ఏమీ చేయలేదన్న కార్మికుల అసంతృప్తి ఇప్పుడు కవితకు మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిపెండెంట్ ఉద్యోగాల కోసం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తీవ్రంగా కృషి చేశారని కానీ కొంత మంది కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, అధికారులు కుదరదని చెప్పినా సరే కేసీఆర్ నిబంధనలను సవరించి వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చేలా చేశారని కవిత చెబుతున్నారు.
సింగరేణి సంస్థలో దాదాపు 40 వేల ఉద్యోగులు ఉన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే.. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అన్నీ చేస్తామని హామీలు ఇచ్చి.. వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం పోయింది కాబట్టి.. పోరాటం చేస్తామని మాత్రమే హామీలు ఇవ్వగలరు. అయితే కవిత మాత్రం.. ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేస్తామంటున్నారు . కోల్ బెల్ట్ ప్రాంతంలో పలితాలను సింగరేణి కార్మికులే ఎక్కువగా డిసైడ్ చేస్తారు. దీంతో ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఫలితం తేడా వస్తే కవితకు పార్లమెంట్ ఎన్నికల్లోనూ గడ్డు పరిస్థితే ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే గట్టిగా ప్రయత్నిస్తున్నారు.