భారతీయ జనతా పార్టీ వ్యూహకర్తలకు ఓ అలవాటు ఉంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు కేంద్ర మంత్రి పదవులు పెంచడం ఆ అలవాటు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి అదే జరగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గట్టి విజయాలు సాధించడానికి ఈ సారి కూడా అలాంటి ప్లాన్లే అమలు చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా ఢిల్లీ నుంచి ప్రచారం జరుగుతోంది. త్వరలో కేంద్రమంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. కొంత మందిని తొలగించి.. మరికొంత మందికి కొత్తగా ఇచ్చే అవకాశం ఉంది.
ఈ క్రమంలో తెలంగాణ నుంచి మరొకరికి మంత్రి పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. బీజేపీకి లోక్ సభ నుంచి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వారిలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి పూర్తి స్థాయి కేబినెట్ హోదాలో ఉన్నారు. మరో మంత్రి లేడు. అయితే కొత్తగా యూపీ నుంచి రాజ్యసభకు లక్ష్మణ్‌ను ఎంపిక చేశారు. ఆయన బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణలో సామాజికవర్గ సమీకరణాల్లో లక్ష్మణ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. సీనియర్ కూడా కావడంతో ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇస్తారని ప్రచారం ప్రారంభమయింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నా కేంద్రమంత్రి లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ సారి అయినా ఏపీకి కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కుతుందా అంటే చెప్పడం కష్టమంటున్నారు. ఏపీ విషయంలో బీజేపీ కానీ.. కేంద్రం కానీ అసలు పట్టించుకునే పరిస్థితుల్లో లేకపోవడంతో ఈ సారి కూడా తెలంగాణకే బెర్త్ ఖరారు కానుందంటున్నారు. తెలంగాణ మంత్రినే ఏపీ కూడా తెలుగు మంత్రి అని సరిపెట్టుకోవాలన్న సలహాలు వినిపిస్తూంటాయి.