మరోసారి విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుత 2015-16 ఆర్ధిక సంవత్సరంలో పెంచిన విద్యుత్ చార్జీల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు 941 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోస్తున్నారు. వచ్చే 2016-17 ఆర్ధిక సంసవత్సరానికి డిస్కంలు రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే మొత్తం భారం ఐదురెట్లు పెరిగి రూ.5,629 కోట్లకు చేరుకుంటుంది.
ఈ మేరకు 2016-17 సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్)రిపోర్టులను డిస్కమ్‌లు రూపొందించాయి. ఈ నెల 24న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల ఉన్నతాధికారుల సమావేశంలో విద్యుత్ చార్జీల పెంపుదలను చర్చిస్తారు. ముఖ్యమంత్రి సూచనలతో మార్పులు చేర్పులు చేసి విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదానికి పంపుతారు.
ఇప్పటికే సిద్దమైన రూ.7,209 కోట్ల డిస్కమ్‌ల ట్రూ అప్ ఛార్జీలకు ఇది అదనం. వీటిపై ఈఆర్సీ తుది ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. వచ్చేనెల 5న దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఈఆర్సీ ప్రకటించనుంది. దానికంటే ముందే డిస్కమ్‌లు 2016-17 వార్షిక ఏఆర్ఆర్ ప్రతిపాదనలను ఈఆర్సీకి అందజేయనున్నాయి.
రాష్ట్రంలో రోజువారీ అవసరాలకు అనుగుణంగా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా అవుతున్నప్పటికీ.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది డిస్కమ్‌లు భారీ ఎత్తున కరెంటును కొనుగోలు చేయాలని ప్రతిపాదించాయి. 2016-17లో కనీసం 4000 మెగావాట్లను ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. దీనికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి డిస్కమ్‌లు ప్రజలపై భారం మోపనున్నాయి. విదేశీ బొగ్గు కొనుగోలు కోసం అయ్యే ఖర్చుని కూడా ఏఆర్‌ఆర్‌లో పొందుపరిచారని తెలిసింది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించడానికి ట్రాన్స్‌కో సహా డిస్కమ్‌లు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టనున్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి చేసే అదనపు ఖర్చు, దీనికోసం ప్రపంచబ్యాంకు నుంచి తీసుకోబోతున్న రూ.2,500 కోట్ల రుణాన్ని హుదుద్ తుఫాను సందర్భంగా విశాఖపట్నంలో సరఫరాను పునరుద్ధరించడానికి చేసిన రూ.1000 కోట్ల మొత్తాన్ని ఏఆర్‌ఆర్‌లో చూపించారని తేలిసింది.