రెండేళ్ళ క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తరువాత అటువంటి నేరాలు పాల్పడేవారిని శిక్షించడం కోసం కేంద్రప్రభుత్వం చాల కటినమయిన నిర్భయ చట్టం అమలులోకి తీసుకువచ్చింది. అయినా దేశంలో మహిళలపై అత్యాచారాలు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు పైగా ఇప్పుడు అభం శుభం తెలియని చిన్నారుల మీద కూడా కామాంధుల అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. అందుకు కారణం ఇంతవరకు అటువంటి నేరాలకు పాల్పడివారికి కటినమయిన శిక్షలు పడినట్లు దాఖలాలు లేకపోవడమేనని చెప్పవచ్చును. ఒకవేళ ఒకటి అరా శిక్షలు పడుతున్న వాటి గురించి మీడియా ప్రచారం చేయకపోవడంతో అటువంటి నేరాలకు పాల్పడినా తాము కూడా సులువుగా తప్పించుకోగలమనే ధీమాతో కొందరు మహిళలు, చిన్నారులపై చాలా నిర్భయంగా అత్యాచారాలు చేస్తున్నారు.
బెంగుళూరు సమీపంలో హోస్పాడు అనే పట్టణంలో అటువంటి నిర్భయ ఘటనే జరిగింది. కదులుతున్న ఒక బస్సులో ఒక నర్సింగ్ విద్యార్ధినిపై ఆ బస్సు డ్రైవర్ అత్యాచారం చేసాడు. ఆమెతో బాటు బస్సు ఎక్కిన ఆమె సహచరులు అందరూ ఒకరొకరుగా ముందు స్టాపులలో దిగిపోవడంతో ఆమె బస్సులో ఒంటరిగా ఉంది. అది గమనించిన బస్సు డ్రైవర్ రవి క్లీనర్ కు బస్సు అప్పగించి ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే అంత దురదృష్టకర ఘటనలో ఆమె అదృష్టం ఏమిటంటే బస్సు డ్రైవర్ ఆమెపై అత్యాచారం చేసిన తరువాత చంపకుండా ఒక నిర్జన ప్రదేశంలో వదిలేసి వెళ్ళిపోయాడు. అటుగా వెళుతున్నవారు ఆమెను రక్షించి ఆసుపత్రిలో చేర్పించి పోలీసులకు పిర్యాదు చేశారు. తక్షణమే రంగంలోకి దిగిన ఆ బస్సు డ్రైవర్, క్లీనర్ ఇద్దరినీ వెతికి పట్టుకొని అరెస్ట్ చేసారు. ఈరోజు మధ్యాహ్నం వారిద్దరినీ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టి అనుమతి తీసుకొన్న తరువాత వారిని ప్రశ్నిస్తారు.