ఏపీ సర్కార్ చట్టాలను.. రాజ్యాంగాన్ని.. నిబంధనలలను పట్టించుకోకుండా పాస్ చేస్తున్న బిల్లులు కోర్టుల్లోనే కాదు.. కేంద్రం వద్ద కూడా ఆగిపోతున్నాయి. కొన్ని అంశాలపై రాజకీయ పార్టీలు.. వాటితో ప్రభావితమయ్యే వారు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మిగతావి కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు వెళ్తున్నాయి. కేంద్రంతో సంబంధం ఉన్న వే అక్కడకు వెళ్తున్నాయి.. వాటికి అక్కడ బ్రేక్ పడుతోంది. దానికి కారణం నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటం.. కేంద్ర చట్టాలకు భిన్నంగా ఉండటమే. మొన్నటికి మొన్న దిశ బిల్లును రెండు, మూడు సార్లు వెనక్కి పంపింది.ఇప్పుడు ల్యాండ్ బిల్లునూ వెనక్కి పంపింది. ల్యాండ్ టైటిల్ బిల్లు-2019లోని అంశాలు అంశాలు, క్లాజులు కేంద్ర చట్టాలను ధిక్కరించేలా ఉన్నాయని.. పలు అంశాలపై రాష్ట్రం ఇచ్చిన వివరణలు సమ్మతంగా లేవంటూ వెనక్కి పంపేసింది.
ల్యాండ్ టైటిల్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన ఏపీ సర్కార్ కేంద్రానికి పంపింది. కేంద్రం రాష్ట్రపతి సంతకం పెట్టించాల్సి ఉంది. కానీ కేంద్ర రిజిస్ట్రేషన్ చట్టం-1908, కేంద్ర భూ సేకరణ చట్టం-2013లోని పలు నిబంధనలు, క్లాజులు అధిగమించేలా చట్టం ఉందని గుర్తించింది. పలుమార్లు వివరణ అడిగినా… స్పష్టత రాకపోవడంతో వెనక్కి పంపింది. బిల్లు కేంద్రానికి వెళ్లిన తర్వాత పదహారు నెలలు పెండింగ్లో ఉంది. ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడుతుందన్న నమ్మకంతోనే.. సమగ్ర భూముల రీసర్వే చేపట్టాలనుకున్నారు.
ల్యాండ్ టైటిల్ బిల్లు మాత్రమే కాదు..దిశ బిల్లు పరిస్థితి కూడా అంతే. ఏపీ సర్కార్ చేస్తున్న చట్టాలు, బిల్లులు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటున్నాయని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. కోర్టుల్లో చాలా వరకు వీగిపోతున్నాయి. కేంద్రం కొన్నింటిని ఆపేస్తోంది. కోర్టుల్లో ఆగిపోయే వాటిపై మాత్రం.. ప్రభుత్వ వర్గాలు ఎదురుదాడి చేస్తున్నాయి. న్యాయస్థానాలకు రాజకీయ ఉద్దేశాలు ఆపాదించి .. నేరుగా దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ కేంద్రం నియమ, నిబంధనలు ఏమిటో చెబుతూ వెనక్కి పంపే బిల్లులపై మాత్రం నోరెత్తడంలేదు. కేంద్రానికి ఎలాంటి ఉద్దేశాలు ఆపాదించడం లేదు. కేంద్రాన్ని విమర్శిస్తే.. పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానీ న్యాయవ్యవస్థపై మాత్రం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.