రెండు జాతీయ అవార్డుల్ని కైవసం చేసుకున్న సినిమా `జెర్సీ`. క్రికెట్ నేపథ్యంలో సాగిన ఈ కథని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. స్పోర్ట్స్ డ్రామాని ఓ ఏమోషనల్ యాంగిల్ లో నడిపించిన విధానం ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని, జాతీయ అవార్డు జ్యూరీనీ ఆకట్టుకుంది. అందుకే బాక్సాఫీసు దగ్గర కాసులు కురిపించిన ఈ చిత్రానికి ఇప్పుడు అవార్డులూ వరుస కట్టాయి. ఈ క్రెడిట్ లో సగ భాగం నిర్మాణ సంస్థైన సితార ఎంటర్టైన్మెంట్స్కీ ఇవ్వాలి.
ఇప్పుడు సితార నుంచి మరో స్పోర్ట్స్ డ్రామా రాబోతోందట. `క్షణం` దర్శకుడు రవికాంత్ పేరేపు.. స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ కథ ని చెప్పాడట. దాన్ని నిర్మాతలు లాక్ చేసేశారు కూడా. ఇప్పుడు హీరోనే కావాలి. అయితే ఈసారి బాస్కెట్ బాల్ నేపథ్యంలో సాగే కథని తీయబోతున్నార్ట. మనకు క్రికెట్, కబడ్డీ ఆటలపైనే గురి. బాస్కెట్ బాల్ మనాట కాదు. చాలామందికి ఆ ఆట నిబంధనలు కూడా తెలీవు. అందుకే.. రిస్కేమో అని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భావిస్తోంది. మనకేమాత్రం సంబంధం లేని రగ్బీ నేపథ్యంలో వచ్చిన `సై` హిట్టు కొట్టింది. రాజమౌళిని తలచుకుని ధైర్యం చేస్తే ఈ బాస్కెట్ బాల్ కథనీ మనం వెండితెరపై చూసేయొచ్చు.