ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల మద్దతు కోసం రూ.5కోట్లు లంచం ఇస్తుండగా, సమాచార్ ప్లస్ అనే న్యూస్ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ చేసి దానిని చిత్రీకరించి మీడియాకి విడుదల చేయడంతో, ఆయనపై సిబిఐ కేసు నమోదు చేసి ఈరోజు ప్రశ్నించబోతోంది. ఆయన మళ్ళీ మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చెరో రూ.25 లక్షలు ఇచ్చినట్లు మరో స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపడింది. ఆ ఎమ్మెల్యేలిద్దరి మద్య జరిగిన వీడియో రికార్డ్ చేసిన టెలీఫోన్ సంభాషణను భాజపా నేత భగసింగ్ కోషారియా డిల్లీలో నిన్న రాత్రి విడుదల చేసారు. మైనింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బునే ఇద్దరికీ పంచిపెడుతున్నట్లు ఎమ్మెల్యే మదన్ సింగ్ బిస్త్ మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే హరక్ సింగ్ రావత్ తో చెప్పడం ఆ వీడియోలో రికార్డ్ అయింది.
మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ శాసనసభలో రేపు తన మెజార్టీ నిరూపించుకోవడానికి సుప్రీం కోర్టు ధర్మాసనం అవకాశం కల్పించింది. శాసనసభలో మొత్తం 70 స్థానాలు ఉండగా వాటిలో కాంగ్రెస్ పార్టీకి 36 సీట్లు ఉండేవి. కానీ ప్రభుత్వంపై తిరుబాటు చేసినందుకు 9మందిపై అనర్హత వేటు వేయడంతో ఆ సంఖ్య 27కి పడిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 36మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇదివరకు రావత్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు. కానీ మారిన రాజకీయ పరిస్థితులలో వారిలో ఎంతమంది ఆయనకి మద్దతు ఇస్తారో తెలియదు. అలాగే ప్రస్తుతం ఆయన వెనుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎంతమంది భాజపా వైపు వెళ్లిపోతారో కూడా తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒకవేళ వారందరూ ఆయనకే మద్దతు ఇచ్చినా కూడా ఇంకా మరో 8మంది ఎమ్మెల్యేల మద్దతు ఇస్తే తప్ప బలపరీక్షలో నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు. అందుకే తనకు మద్దతు ఇస్తున్నవాళ్ళని చేజారిపోకుండా లంచాలు ఇవ్వడానికి సిద్దపడుతున్నట్లున్నారు. కానీ ఆ ప్రయత్నంలో మళ్ళీ దొరికిపోవడం వలన, దానిపై కూడా సిబిఐ కేసు ఆయన మెడకు చుట్టుకొనే అవకాశం కనబడుతోంది.
భాజపా అడ్డుదారిలో అధికారం దక్కించుకొనేందుకే తనపై బురద జల్లుతోందని హరీష్ రావత్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ కి చెందిన భాజపా నేత కైలాష్ విజయ్ వర్గీకి ఇటువంటి సమయంలో ఉత్తరాఖండ్ లో ఏమి పని? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నయాన్నో భయాన్నో తనవైపు త్రిప్పుకొనేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తూ, మళ్ళీ తనపై బురద జల్లుతోందని విమర్శించారు. నిన్న బయట పెట్టిన ఆ వీడియోతో తనకేమీ సంబంధం లేదని రావత్ ప్రకటించారు.
రేపు శాసనసభలో జరుగబోయే బలపరీక్షలో హరీష్ రావత్ ఓడిపోవడం ఖాయమని, చాలా మంది ఎమ్మెల్యేలు భాజపాకి మద్దతు ఇవ్వడానికి సంసిద్దత వ్యక్తం చేసారని, కనుక రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం తధ్యమని మాజీ ముఖ్యమంత్రి కొషారియా అన్నారు.