గోదావరిలో ఇసుక తిన్నెల్లో .. క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని ఎవరికి ఉండదు ? అదే సమయంలో కింద గోదారి పారుతూంటే.. పైన పార్టీ చేసుకుంటే ఇంకెంత మజాగా ఉంటుంది ?. ఇలాంటి చిన్న చిన్న ఆనందాల కోసం వచ్చే పర్యాటకుల కోసం మరో ప్రత్యేక ఏర్పాటును చేయడానికి ఏపీ పర్యాటక శాఖ రెడీ అయిపోయింది.
రాజమండ్రిలో హేవలాక్ వంతెన గురించి తెలియని వారు ఉండరు. వందేళ్ల పాటు సేవలందించిన ఆ రైలు బ్రిడ్ది వాడకాన్ని ఇప్పుడు నిలిపివేశారు. ఆ బ్రిడ్జి అలాగే ఉంది. ఇంకా వందేళ్లు అయినా స్ట్రాంగ్ గా ఉంటుంది. రైల్వేశాఖకు చెందిన ఆ బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని టూరిజం స్పాట్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం రూ. 120 కోట్లతో ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. నిజానికి 2014-19 మధ్య ఇందు కోసం ప్లాన్ రెడీ అయింది. అయితే తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆ ప్రణాళికలన్నీ పక్కకు పోయాయి.
హేవలాక్ వంతెనను 1900వ సంత్సరంలో అప్పటి మద్రాసు గవర్నర్ ఎలిబంక్ హేవలాక్ నిర్మించారు. అందుకే ఆయన పేరు మీదనే ప్రాచుర్యం పొందింది. ఇంజనీరింగ్ అద్భుతాలకు నిదర్శనంగా ఈ వంతెన నిలిచింది.
56 స్తంభాలతో 2.95 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన వందేళ్లు పూర్తిచేసుకోవడంతో 1997లో ఈ వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. ఇన్నాళ్లకు దాన్ని టూరిజం స్పాట్ గా మార్చే ప్రయత్నాలు పట్టాలెక్కుతున్నాయి.