తెలంగాణ రాష్ట్ర సమితిలో రాను రాను చంద్రబాబు, ఎన్టీఆర్ అభిమానులు పెరిగిపోతున్నారు. కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇప్పుడు తాను చంద్రబాబు ఫ్యాన్ ను అంటున్నారు. అలా ఇలా కాదు.. ఏకంగా .. తన ఎమ్మెల్యే పదవి చంద్రబాబు పెట్టిన భిక్ష అంటున్నారు. గత ఎన్నికల్లో సుధీర్ రెడ్డి పోటీ చేయాల్సిన ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని మొదట టీడీపీ తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే చివరి క్షణంలో కాంగ్రెస్కు కేటాయించారు. అక్కడ టీడీపీ తపునపోటీ చేయాల్సిన సామ రంగారెడ్డిని ఇబ్రహీంపట్నంకు పంపించారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేసిన సుధీర్ రెడ్డిగెలిచారు. సామ రంగారెడ్డి ఓడిపోయారు.
తనకు ఎల్పీనగర్ దక్కకుండా ఉత్తమ్, మల్ రెడ్డి వంటివారు కోట్లు ఖర్చుపెట్టారని.. కానీ చంద్రబాబు మాత్రం అక్కడ తాను అయితేనే గెలుస్తానని భావించి టిక్కెట్ వచ్చేలా సహకరించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆ రోజు సహకరించకపోతే.. తాను ఎమ్మెల్యేగా ఉండేవాడిని కాదన్నారు. 2019లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు చేసిన సాయానికి గుర్తుగా ఎల్బీనగర్లో ఎన్టీఆర్ విగ్రహం పెడతానని కూడా ప్రకటించారు.
నిజానికి సుధీర్ రెడ్డి వైఎస్ ముఖ్య అనుచరుడు. జగన్కు సన్నిహితుడనే పేరు ఉంది. ఆ కారణంగానే ఆయనతో బేరసారాలు ఆడి టీఆర్ఎస్ లో చేర్పించగలిగారని అంటూంటారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా అయన చంద్రబాబు జపం చేస్తున్నారు. ఎల్బీనగర్లో ఉన్న సెటిలర్ల ఓట్లే అలా మాట్లాడిస్తున్నాయన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.