అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్‌ను… ఆంధ్రప్రదేశ్ పోలీసులు… గుంటూరులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడికి చెందిన హీరోహోండా షోరూమ్ నుంచి స్వాధీనం చేసుకుని తీసుకెళ్లారు. నిజానికి ఆ షోరూంకు.. ఆర్టీఏ అధికారులు సీజ్ చేసి ఉన్నారు. ఆ సీజ్‌ను తీసేసి.. మరీ పోలీసులు హఠాత్తుగా రాత్రికి రాత్రి తీసుకెళ్లిపోయారు. అప్పటి వరకూ కోడెల శివప్రసాదరావు.. ఫర్నీచర్.. మా దగ్గరే ఉందని.. అసెంబ్లీ అధికారులు ఎవరు వచ్చినా.. మొత్తం అప్పగిస్తామని ప్రకటిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ.. కోడెల వద్దకు.. ఏ అసెంబ్లీ అధికారి వెళ్లలేదు. ఫర్నీచర్ తిరిగివ్వాలని అడగలేదు. కానీ.. పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు.
అసెంబ్లీ ఫర్నీచర్‌ను.. మాజీ స్పీకర్ కోడెల అక్రమంగా తీసుకెళ్లారంటూ… నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత అసెంబ్లీలో ఓ సెక్షన్ ఆఫీసర్ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు, అసెంబ్లీ అధికారుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఫర్నీచర్‌ను.. తీసుకెళ్లారు. అంతకు ముందే.. కోడెల శివప్రసాదరావు… హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫర్నీచర్ తీసుకెళ్లేలా… అసెంబ్లీ అధికారులను ఆదేశించాలని.. ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ పై తమ వాదనలు వినాలని.. ప్రభుత్వం కోరింది. దాంతో.. ఒక్క రోజుకు విచారణ వాయిదా వేశారు. ఈ క్రమంలోనే… వెంటనే.. పోలీసులు ఫర్నీచర్‌ను హడావుడిగా.. తీసుకెళ్లిపోయారు. ఆ ఫర్నీచర్ .. ఎలా ప్యాక్ చేశారో.. అలాగే.. ఉంది. దాన్నే లారీల్లోకి ఎక్కించారు.
అసెంబ్లీ ఫర్నీచర్ అప్పగిస్తామని కోడెల స్వయంగా చెప్పినా… అసెంబ్లీ, పోలీస్ అధికారులు అన్యాయంగా ప్రవర్తించారని.. ఇప్పుడు.. కోడెల తరపు న్యాయవాదులు మండిపడుతున్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించారని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీజ్ చేసిన షోరూమ్‌ని ఎందుకు తెరిచారని… సీజ్ చేసిన షోరూం నుంచి ఫర్నీచర్ తీసుకెళ్లడం చట్ట విరుద్ధమని కోడెల లాయర్ చెబుతున్నారు. ఇంత కాలం… ఫర్నీచర్ అక్కడ ఉందని తెలిసి కూడా.. పోలీసులు, అసెంబ్లీ అధికారులు లైట్ తీసుకోవడమే కాకుండా.. హఠాత్తుగా.. కోడెల కోర్టుకెళ్లగానే.. తీసుకెళ్లడం ఏమిటన్న చర్చ ప్రారంభమయింది. ఈ కేసులో మరికొన్ని ట్విస్టులు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.