హైదరాబాద్: ప్యారిస్‌లో మొన్న శుక్రవారంనాటి ఉగ్రవాద దాడికి పాల్పడిన ఉగ్రవాదులకోసం కొనసాగుతున్న వేట ఇవాళ ముగిసింది. ప్యారిస్ ఉత్తర ప్రాంతంలో ఇవాళ పోలీసులు ఒక అపార్ట్‌మెంట్‌పై జరిపిన దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు… మరో ఏడుగురు ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. చనిపోయిన ఉగ్రవాదులలో ఒకరైన మహిళా ఉగ్రవాది తనను తాను పేల్చుకుని చనిపోయింది. సెయిండ్ డెనిస్ అనే ప్రాంతంలో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఇవాళ దాదాపు 6 గంటలపాటు ఎదురు కాల్పులు జరిగాయి.
సెయిండ్ డెనిస్ ప్రాంతం ఇవాళ ఉదయంనుంచి కాల్పులు, బాంబు పేలుళ్ళతో దద్దరిల్లింది. పోలీసులు ఆ ప్రాంతంలోని దుకాణాలు, పాఠశాలలను ముసేయించారు. ప్రజలను ఇళ్ళనుంచిచ బయటకు రావద్దని సూచించారు. ఐసిస్ సంస్థ కీలక నేత, ప్యారిస్ పేలుళ్ళ సూత్రధారిగా భావిస్తున్న అబౌద్ అక్కడ ఉన్నాడని పోలీసులు భావించారు. అయితే అతను పట్టుబడినట్లు సమాచారం లేదు. ఉగ్రవాదుల ఫ్లాట్‌లో అనేక ఆయుధాలు, ఆత్మాహుతి జాకెట్లు, మరో ఉగ్రవాది దాడికి చేసిన ప్లాన్లు దొరికాయి. మరోవైపు శుక్రవారం రాత్రి ప్యారిస్ నగరంలో చనిపోయిన మొత్తం 129 మందినీ పోలీసులు గుర్తించారు.