రచయితలు దర్శకులైతే చాలా సౌఖ్యాలు, సౌలభ్యాలూ ఉంటాయి. తమకు కావల్సింది తామే రాసుకోవొచ్చు. రచయితల కోసం తిరగాల్సిన పనిలేదు. వెర్షన్లకు వెర్షన్లు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం అంత కన్నా లేదు. పది మంది కూర్చుని స్క్రిప్టు పని పట్టాల్సిన కష్టం కూడా రాదు. ఒంటి చేత్తో స్క్రిప్టు పూర్తయిపోతుంది. కొరటాల శివ కూడా రచయితల కులం లోంచి వచ్చి, దర్శకుడిగా మారినవాడే. ఇప్పటి వరకూ తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్టులు తానే సిద్ధం చేసుకున్నారు. సహాయ రచయితల సహకారం తీసుకున్నారు గానీ, వాళ్లంతా కుర్ర గ్యాంగే.
అయితే తొలిసారి కొరటాలకు మరో హ్యాండు అవసరమైంది. మరో ప్రొఫెషనల్ రైటర్‌తో ఆయనకు పని పడింది. చిరంజీవి 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి `ఆచార్య`అనే పేరు ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం కొరటాల శ్రీధర్ సిపానని రైటింగ్ బ్యాచ్‌లో చేర్చుకున్నారు. గతంలో కొన్ని విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేశారు శ్రీధర్. మెగాఫోన్ కూడా పట్టారు. ఇప్పుడు ఆయన ‘ఆచార్య’కు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు రాశారు. కొరటాల శివ ఎమోషన్ని బాగా పండిస్తారు. సీరియస్ విషయాల్ని చక్కగా రాస్తారు. కానీ… వినోదాత్మక సన్నివేశాలు, ప్రేమ సన్నివేశాలు పలకాల్సిన చోట.. ఆయన పెన్ను కాస్త మెరాయిస్తుంటుంది. ఆ లోటు ఈ సినిమాలో కనిపించకుండా ఉండడానికి శ్రీధర్ ని తన టీమ్‌లోకి చేర్చుకున్నారని తెలిసింది. ఆచార్య సీరియస్‌గా నడిచే కథే. అయితే… ఇందులోనూ కాస్త వినోదం, కాస్త రొమాన్స్ ఉండబోతున్నాయి. అందుకే.. తన టీమ్‌లో శ్రీధర్ చేరాడు.