వైసీపీ ఎమ్మెల్యేలకు జిల్లాల్లో పనులు కాకపోవడంతో ఉక్కపోత ప్రారంభమయింది. అది అటూ ఇటూ తిరిగి కలెక్టర్ల మీదకు వెళ్తోంది. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపాయి. ఇప్పుడు అదే రేంజ్లో మరో ఎమ్మెల్యే తెరపైకి వచ్చారు. ఆయనే అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఆయన కలెక్టర్ గంధం చంద్రుడుపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నట్లుగానే… ఇవాళ ఉండి రేపు పోయే కలెక్టర్ అని విరుచుకుపడ్డారు. “జిల్లా మేజిస్ట్రేట్ అయితే చంపేస్తావా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలం గాడిదలు కాయడానికి ఉన్నామా?” అంటూ ఎమ్మెల్యే కంట్రోల్ తప్పిపోయారు.
అంతే గాక కలెక్టర్‌పై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు.కలెక్టర్ చేసిన పనికిమాలిన పనులు చెప్పాలంటే పేజీలు చాలవని… హనీ ట్రాప్ గురించి పత్రికల్లో రాకపోయి ఉంటే ఈ పాటికి బదిలీ అయి ఉండేవారని మండిపడ్డారు. హనీ ట్రాప్ గురించి కొత్తగా వెంకట్రామిరెడ్డి మాట్లాడటంతో అసలేం జరిగిందన్న చర్చ కూడా అనంతపురం రాజకీయాల్లో జరుగుతోంది. కొద్ది రోజుల కిందట… ఆంధ్రజ్యోతి దినపత్రిక పేర్లు చెప్పకుండా ఇద్దరు కలెక్టర్ల ఘనకార్యాల గురించి రాసింది. ఇందులో ఓ కలెక్టర్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో వ్యవహరించే తీరు గురించి ఉంది. ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని కూడా చెప్పింది. బహుశా.. ఆ హనీ ట్రాప్… గంధం చంద్రుడు గురించేనని.. వెంకట్రామిరెడ్డి మాటలతో తెలిసిపోతోందని…అనంతపురం జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు.
కలెక్టర్లకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలకు కనీస గౌరవం దక్కడం లేదు. జిల్లాలో మంత్రులుగా ఉన్న వారే మొత్తం పెత్తనం చెలాయిస్తున్నారు. ఇతర ఎమ్మెల్యేల మాట కూడా చెల్లుబాటు కావడం లేదు. అదే సమయంలో.. నిధులు లేకపోవడంతో.. ఎమ్మెల్యేలు అడిగిన పనులు కూడా చేయలేకపోతున్నారు. ఈ కారణంగా .. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసహనం పెరిగిపోతోంది. అది కలెక్టర్లపై దూషణల వరకూ వెళ్తోంది. ఇలాంటి ఎమ్మెల్యేలను ప్రభుత్వం మందలించను కూడా మందలించకపోతూండటంతో… అలాంటి వారి సంఖ్య పెరిగిపోతోంది.