శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే దేవాదాయ మంత్రి వెల్లంపల్లికి కరోనా సోకడంతో ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే లక్షణాలేమీ లేకపోవడంతో..బ్రహ్మోత్సవాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత చురుకుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆదివారం అంతర్వేదిలో పర్యటించారు. మరో మంత్రి ధర్మానతో కలిసి.. రథం పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో చురుకుగా వ్యవహరించిన ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్ రావడంతో వైసీపీలో కలకలం ప్రారంభమయింది. వైసీపీ ప్రజాప్రతినిధులు … కోవిడ్ జాగ్రత్తల విషయంలో ఒకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ కారణంగా ఎవరైనా లక్షణాలు లేని కరోనా పేషంట్లు ఉంటే..వారి ద్వారా… శరవేగంగా వ్యాపిస్తోంది.
ప్రస్తుతం ఇద్దరు మంత్రులకు బ్రహ్మోత్సవాలల్లో పాల్గొన్న రెండు, మూడురోజుల తర్వాత స్వల్ప లక్షణాలు కనిపించాయి. ఇప్పుడు వీరితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరూ టెన్షన్ పడే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఏ మాత్రం తగ్గడం లేదు. రోజుకు ఎడెనిమిది వేల కేసులు నమోదవుతున్నాయి. సగటున అరవైమంది వరకూ చనిపోతున్నారు.