తెలుగు తెర ‘బాలరాజు’!
అమ్మాయిల మనసుల్లో ‘అందాల రాముడు’.
ప్రేమకథల ‘దేవదాసు’!!
సోషల్ స్టోరీలకు ‘డాక్టర్ చక్రవర్తి’.
సరదాలు పంచే ‘దసరా బుల్లోడు’.
పరిధులు దాటని ‘బుద్ధిమంతుడు’.
– ఎవరు..?
ఇంకెవరు…? మన ఏఎన్నార్!! అక్కినేని నాగేశ్వరరావు.
తెలుగు చలచ చిత్ర చరిత్రలో అక్కినేని ఓ పేజీ కాదు, ఓ అధ్యాయం కాదు… సగం పుస్తకం!!
తెలుగు సినిమా గురించి రాసిన ప్రతీ అక్షరంలోనూ అక్కినేని అడుగు జాడలు కనిపిస్తాయి. తెలుగు సినిమా ప్రతీ మలుపులోనూ అక్కినేని పాద ముద్రలు ఆహ్వానం పలుకుతాయి.
ఓ తరాన్ని ఉర్రూతలూగించి, మరో తరానికి బాటలు వేసి, తరతరాలకూ చెరిగిపోని, చెదిరిపోని జ్ఞాపకాలు అందించిన జీవితం.. ఏఎన్నార్ ది.
అక్కినేని ఒక్కడే వచ్చాడు. ఒక్కడే పోరాడాడు. ఒక్కడే కష్టపడ్డాడు. కానీ.. తనతో పాటు తనని నమ్ముకొన్న వాళ్లని, చిత్రసీమనీ ఒక్కో మెట్టూ ఎక్కించాడు. చిత్రసీమకు రెండు కళ్లయితే.. అందులో ఓ కన్ను అక్కినేనిది అని గర్వంగా చెప్పుకొనేంత స్థాయిలో కూర్చుకొన్నాడు. ఇంతకంటే ఓ నటుడి జీవితానికి సార్థకత ఏం కావాలి?
‘మీ బలం ఏమిటి’ అని అక్కినేనిని ఓసారి అడిగితే..
‘నా బలహీనత నాకు తెలియడమే’ అని సమాధానం ఇచ్చారు.
‘స్వీయలోపంబులు ఎరుగుట పెద్ద విద్య’ అని నమ్మిన వ్యక్తి అక్కినేని. తన బలాలు, బలహీనతలు స్పష్టంగా తెలుసుకొన్న నటుడు.
‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడిగా, ఏఎన్నార్ అర్జునుడిగా నటించారు. ఆ సినిమా బాగా ఆడింది. ఇద్దరికీ మంచి పేరొచ్చింది. కానీ సినిమా చూసొచ్చాక ఏఎన్నార్ సతీమణి అన్నపూర్ణమ్మ ఓ మాట అన్నార్ట.
‘ఇంకెప్పుడూ రామారావు గారి పక్కన పౌరాణికాలు చేయకండి’ అని. మరొకరైతే ‘హాఠ్… నాకే సలహాలు ఇస్తావా’ అని కసురుకొనేవారు. కానీ అక్కినేని అలా చేయలేదు. ‘నిజమే కదా’ అని ఆత్మ విమర్శ చేసుకొన్నారు.
‘క్లైమాక్స్ లో అర్జునుడు రథం దిగి కృష్ణుడికి నమస్కరించాలి. నేను రథం దిగి కింద నిలబడ్డాను. రామారావు గారు రథం మీద ఉన్నారు. అసలే ఆయన ఆజానుభావుడు. పైగా రథం మీద ఉన్నారు. నేను ఆయన ముందు మరింత పొట్టిగా కనిపించాను. పక్కన ఉన్నా సరే, ఆయనదే ఆకర్షణీయమైన రూపం. అందుకే నా భార్య మాటకు నేను విలువ ఇచ్చాను’ అంటూ తన ఆత్మకథలో రాసుకొన్నారు ఏఎన్నార్.
ఎన్టీఆర్ పౌరాణికాలలో చక్రం తిప్పుతుంటే… ఏఎన్నార్ తెలివిగా సోషల్ కథలు ఎంచుకొన్నారు. ఆ ఎత్తుగడ అద్భుతమైన ఫలితాల్ని అందించింది. ఈ జోనర్లో అక్కినేనిని కొట్టేవాడే లేకుండా పోయాడు. ప్రేమకథ అక్కినేనికి తిరుగులేని విజయాలు అందించాయి. అలాగని అలాంటి కథలకే పరిమితం కాలేదు. కాలానుగుణంగా తనని తాను మార్చుకొన్నారు.
బాటసారి, దేవదాసు, డా.చక్రవర్తి, అంతస్తులు, అందాలరాముడు, మిస్సమ్మ, మాయా బజార్, దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, విప్ర నారాయణ, తెనాలి రామకృష్ణ, మహాకవి కళిదాసు, సుడిగుండాలు… వీటిలో ఏ ఒక్క పాత్రతోనైనా, మరో పాత్రకు పోలిక ఉందా? పోటీ ఉందా? దేవుడూ తనే, భక్తుడూ తనే. విఫల ప్రేమికుడూ తనే. భార్యమాటకు ‘ఊ’ కొట్టే సగటు భర్తా తనే. దసరా బల్లోడు తానే, ధర్మదాత కూడా తానే. ఈ విలక్షణతే, ఏఎన్నార్ని దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమ గుర్తు పెట్టుకొనేలా చేసింది.
చెన్నైలో పాతుకుపోయిన తెలుగు చిత్రసీమని హైదారాబాద్ కు రప్పించేలా చేసిన ఘనత వహించిన అతి కొద్దిమందిలో అక్కినేని పేరు ముందు వరుసలో ఉంటుంది. కొండల మధ్య ‘అన్నపూర్ణ స్టూడియో’ బోర్డు పెట్టినప్పుడు అంతా అక్కినేనిని చూసి ఎగతాళి చేసిన వాళ్లే. కానీ ఇప్పుడు ‘అన్నపూర్ణ స్టూడియోస్’ తెలుగు చిత్రసీమకు కేరాఫ్ అడ్రస్స్ గా మారిపోయింది. ఎంతోమందికి ఉపాధి కల్పించింది. ఎంతో మంది జీవితాల్లో ఇప్పటికీ వెలుగు నింపుతూనే ఉంది.
ఇంత స్టార్ డమ్ వచ్చాక.. ఏ నటుడికైనా రాజకీయాల్లోకి దిగి, అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉంటుంది. పైగా తన సహచరుడు ఎన్టీఆర్ రాజకీయాల్లో విజయఢంకా మోగించడం చూశాక ఆ ఆశ అణువంతైనా కలుగుతుంది. కానీ ఏఎన్నార్ చలించలేదు. ‘మనకెందుకులే రాజకీయాలు’ అని దాని జోలికే వెళ్లలేదు. ఎన్టీఆర్ పిలిచినా సరే.. సున్నితంగా తిరస్కరించారు. జీవితాంతం రాజకీయాలకు అతీతంగానే గడిపారు.
‘చివరి శ్వాస ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటా’ అనే మాట చాలా కామన్ గా వింటుంటాం. నటీనటులకు ఇదో ఊతపదం అయిపోయింది. కానీ ఆ మాటపై అక్షరాలా నిలబడిన నటుడు అక్కినేని. కాన్సర్ మహమ్మారి తన శరీరంలో చొచ్చుకుపోయినప్పుడు అధైర్య పడలేదు. ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తన సమస్య గురించి ధైర్యంగా చెప్పుకొన్నారు. మృత్యువు తరుముతున్నా ‘మనం’లో నటించారు. బాధని అణచిపెట్టుకొని, చావుని వాయిదా వేసి.. ఆ సినిమా పూర్తి చేశారు. ఆ తరవాతే తనువు చాలించారు.
ముందే చెప్పినట్టు.. ఆయన ఒంటరిగానే వచ్చాడు. ఒంటరిగానే వెళ్లిపోయాడు. కానీ ఈ ప్రయాణంలో ఎన్నో మజిలీలు. మరెన్నో ఘన చరితలు. మొక్కై ఎదిగి, మహా వృక్షమయ్యాడు. ఆ శాఖలు చిత్రసీమ అంతా విస్తరించాయి. అక్కినేని భౌతికంగా మన మధ్య లేకపోవొచ్చు. కానీ… ఆ చల్లని నీడ చిత్రసీమపై అలానే ఉంటుంది. ఇప్పుడు… ఎప్పుడూ… ఎల్లప్పుడూ!
”ఏఎన్నార్ లివ్స్ ఆన్”
(ఈరోజు అక్కినేని శత జయంతి)