1958 నాటి రోజులు. కారంచేడు అనే ఓ ఊరిలో ‘నమ్మిన బంటు’ సినిమా తీస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు హీరో. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. ఊర్లో షూటింగ్ అంటే మామూలుగా ఉండేదా? ఆ హడావుడే వేరు. షూటింగంటే ఊరూ, వాడ అంతా అక్కడే ఉండేది. కారంచేడులో ఐదారు రైసు మిల్లులున్న ఓ ఆసామికీ షూటింగులంటే ఇష్టం. అందుకే.. `నమ్మినబంటు` షూటింగ్ జరిగిననన్ని రోజులూ.. ఆ చిత్రబృందానికి ఏ లోటూ రాకుండా చూసుకునే బాధ్యత తనకు తానుగా తన భుజాలపై వేసుకున్నాడు. భోజనాలన్నీ ఆ ఇంటి దగ్గర్నుంచే. సెట్లో ఫలానా వస్తువు కావాలంటే, నిర్మాతని అడిగేవారు కాదు. ఆ పెద్దాయన దగ్గరకే వెళ్లేవారు. వేలకు వేలు.. తన జేబులోంచి తీసి ఖర్చు చేసేవాడు. ఏర్పాట్లన్నీ చూసి… `ఈ కుర్రాడేంటి? ఇంత స్పీడుగా ఉన్నాడు` అంటూ ఏఎన్నారే ఆశ్చర్యపోయారంటే నమ్మండి.
నమ్మిన బంటులో ఎడ్లబండి పోటీలకు సంబంధించిన ఓ ఎపిసోడ్ ఉంది. అక్కినేని, సావిత్రి ఈ పోటీలో పాల్గొంటారు. అక్కినేనికి అంతకు ముందు ఎడ్లబండ్లని నడిపిన అనుభవం లేదు. దాంతో… ఆయనకు డూప్ గా నటించడానికి ఆ రైసు మిల్లు ఓనరే ముందుకొచ్చాడు. ఆ సీన్లు ఇప్పటికీ చూస్తే.. లాంగ్ షాట్లో ఉన్నవన్నీ డూప్‌తో తీసినవే. క్లోజప్‌లో మాత్రం అక్కినేని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. ఓ సినిమా కోసం.. ఇంతగా తపిస్తున్న కుర్రాడిని చూసి ఆ చిత్ర నిర్మాత యార్లగడ్డ వెంకన్న చౌదరి `ఈ సినిమాలో నీకు 5 పైసల వాటా ఇస్తాం.. తీసుకో` అని ఆఫర్ చేశారు. కానీ ఆ కుర్రాడు ఒప్పుకోలేదు. `నాకు సినిమాలన్నా, షూటింగులన్నా చాలా ఇష్టం. మీరంతా నా ఆతిథ్యం స్వీకరించారు. సినిమా పూర్తి చేశారు. అదే చాలు..` అన్నాడు. ఈ వాటాలు వద్దు.. తీస్తే సినిమానే తీస్తా – అంటూ ధీమాగా మాట్లాడాడు. ఆ రైసు మిల్లు ఓనరే, ఏఎన్నార్‌కి డూప్‌కి నటించిన ఆ కుర్రాడే.. ఆ తరవాత సినిమా ఇండ్రస్ట్రీలోకి అడుగపెట్టి, నిర్మాతగా మారి, అక్కినేనితోనే సిల్వర్ జూబ్లీలు తీసి, ఓ స్టూడియోని స్థాపించి, తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించి, దేశం మొత్తంలోనే నిర్మాతలకు దిక్చూచీగా నిలిచి, మూవీ మొఘల్ గా కీర్తి గడించిన.. డా.డి. రామానాయుడు.