అక్కినేని నాగేశ్వరరావుకి ఆత్మాభిమానం కుసింత ఎక్కువే. దానికి భంగం కలిగించాలని చూస్తే ఊరుకునేవారు కాదు. అది ఎంతటి వ్యక్తి అయినా. తిరిగి జవాబు చెప్పడానికి తగిన సమయం కోసం వేచి చూసేవారు. ఆ అవకాశం వస్తే ఏమాత్రం వదులుకునేవారు కాదు. తాను ఎదుగుతున్న సమయంలో జరిగిన పరాభవాలకు, ఎదిగిన తరవాత.. ప్రతీకారం తీర్చుకున్న సందర్భాలున్నాయి. అలాంటివాటిలో ఇదొకటి.
అక్కినేని నాటకాల నుంచి వచ్చిన వ్యక్తి. నాటక రంగంలో ఉన్నవాళ్లు చక్కగా పాడగలరు. అందుకే అక్కినేని చిత్రసీమలోకి అడుగుపెట్టిన తొలి నాళ్లలో సెట్లో తీరిక దొరికినప్పుడు అక్కినేనిని పిలిచి ఏదైనా పద్యం, లేదా పాట పాడించుకునేవాళ్లు. పెద్దవాళ్ల మధ్య అక్కినేని సరదాగా పాటలు పాడుతూ వాళ్ల కితాబులు అందుకునేవారు. సి.పుల్లయ్య సినిమా సెట్లో ఓసారి ఇలానే పాట పాడి అందరినీ అలరించాడు అక్కినేని. అక్కినేనిలో ఈ టాలెంటు గుర్తించిన పుల్లయ్య.. సందర్భం కుదిరిన ప్రతీసారీ.. ‘ఓ పాట పాడరా అబ్బాయ్..’ అంటూ అడిగి మరీ పాడించుకునేవారు. అయితే.. అక్కినేని దగ్గర ఓ అలవాటు ఉంది. తనకు బాగా వచ్చిన పద్యాల్ని మాత్రమే పాడేవారు. అలాంటప్పుడు పాడిన పద్యాలే రిపీట్ అవ్వడం కద్దు. అలా ఓసారి పుల్లయ్య ముందు పాడిన పద్యాన్నే మళ్లీ పాడడంతో… పెద్దాయనకు కోపం వచ్చింది. ‘ఇది తప్ప ఇంకేం రాదట్రా..’ అంటూ ఓ పచ్చి బూతు మాట వాడారు. దాంతో.. అక్కినేని తెగ బాధ పడిపోయారు. సెట్లో అందరి ముందూ అంత మాట అనేస్తారా? అంటూ పక్కకెళ్లి కంటతడి పెట్టుకున్నారు. దాంతో అక్కినేని సహచరులు వచ్చి ‘ఆయనంతే.. పెద్దాయన.. ఓ మాట టక్కున అనేస్తారు. పరిశ్రమలో ఇది మామూలే’ అంటూ అక్కినేనిని సముదాయించే ప్రయత్నం చేశారు.
కొన్నాళ్లకు అక్కినేని స్టార్ అయిపోయారు. అక్కినేని కి సెట్లో జరిగిన పరాభవం అంతా మర్చిపోయారు. సి.పుల్లయ్యతో సహా. కానీ అక్కినేని మాత్రం మర్చిపోలేదు. ఎలాగైనా సరే, చేసిన తప్పు ఒప్పుకుని, పుల్లయ్య చేత క్షమాపణలు చెప్పించుకోవాలని అనుకున్నారు. ఆ రోజు కూడా వచ్చింది.
ఓ రోజు పుల్లయ్య కి అక్కినేని కాల్షీట్లు కావల్సివచ్చాయి. ‘అర్థాంగి’ అనే సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారాయన. అన్నాదమ్ముల కథ అది. అన్న పాత్రలో ఎన్టీఆర్ నీ, తమ్ముడి పాత్రలో అక్కినేనిని అనుకున్నారు. ముందుగా అక్కినేని కాల్షీట్లు తీసుకోవాలన్న ఉద్దేశంతో పుల్లయ్య నిర్మాతని వెంట పట్టుకుని మరీ వచ్చారు. ‘నీ కాల్షీట్లు కావాల్రా అబ్బాయ్’ అంటూ. అయితే అక్కినేని నింపాదిగా ‘మీ దగ్గర పని చేయాలంటే మీ తిట్టు కూడా కాచుకోవాలి. వాటిని భరించే శక్తి నాకు లేదు’..` అంటూ చురక అంటించారు. అక్కినేనికి గతంలో తాను అవమానించాన్న సంగతి గుర్తొచ్చి… తెగ ఇబ్బంది పడ్డారు పుల్లయ్య. ”ఆ విషయం ఇంకా గుర్తు పెట్టుకున్నావా.. అప్పుడంటే చిన్నపిల్లాడివి. అందుకే పెద్దరికం కొద్దీ నోరు జారి ఉంటాను. నన్ను క్షమించు” అంటూ తన తప్పుకున్నారు. పుల్లయ్యతో క్షమాపణలు చెప్పించుకోవాలన్న కోరిక అలా తీరింది ఏఎన్నార్‌కు. కానీ ఇంకా ఎక్కడో అహం శాంతించలేదు. అందుకే కథంతా విని… ”తమ్ముడి పాత్ర అయితే నేను చేయను. అన్న పాత్ర అయితే చేస్తాను. దాన్ని ఎన్టీఆర్ గారితో చేయించుకోవాలని మీరు అనుకుంటున్నారు కదా. ఆ పాత్రని జగ్గయ్య గారికి ఇవ్వండి.. ఆయన చేస్తారు. నా కాల్షీట్లు కావాలంటే ఈ మార్పులకు ఒప్పుకోండి” అని షరతు విధించారు. ఆఖరికి పుల్లయ్య ఈ షరతుల్ని సైతం ఒప్పుకొన్నారు. అలా.. ‘అర్థాంగి’ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఏఎన్నార్ కెరీర్లో ఇది మరో హిట్. ఈ విషయాన్ని అక్కినేని తన ఆత్మకథలో ప్రస్తావించుకున్నారు కూడా.