ఓడలు బళ్లవ్వడం, బళ్లు ఓడలుగా మారడం చిత్రసీమలో చాలా కామన్. ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారో చెప్పలేం. కాబట్టి.. ఎవరి ముందైనా అనువుగా ఉండాలి. ఒదిగి మాట్లాడాలి. అక్కినేని – పి.పుల్లయ్య మధ్య జరిగిన ఈ స్వీట్ రివైంజ్ డ్రామా తలచుకొంటే… చిత్రసీమలో నోటిని అదుపులో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో అర్థం అవుతుంది. ఒక్కసారి ఆ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే…
అవి ‘ధర్మపత్ని’ రోజులు. పి.పుల్లయ్య దర్శకుడు. ఏఎన్నార్ ఆ సినిమాతోనే నటుడిగా పరిచయం అవుతున్నారు. పిల్లోడు. నాటకాల నుంచి వచ్చాడు. కాబట్టి పద్యాలూ గట్రా బాగా వచ్చు. అందుకే ఖాళీ సమయాల్లో పి.పుల్లయ్య అక్కినేనిని పిలిచి ‘ఓ పద్యం పాడ్రా అబ్బాయి’ అని ప్రేమగా అడిగేవారు. అక్కినేని పాడేవారు. సెట్లో, ఆఫీసుల్లో ఇదే రిపీట్ అయ్యేది. పుల్లయ్య అడిగినప్పుడల్లా అక్కినేని పద్యం పాడేవారు. కానీ.. ఎప్పుడూ ఒకటే పద్యం. అదే వినీ వినీ పులయ్యకు చిర్రెత్తుకొచ్చి… ‘ఎప్పుడూ ఇదే పాడతావేంట్రా..’ అంటూ ఓ బూతు మాట అనేశారు. దాంతో అక్కినేని మనసు చివుక్కుమంది. షూటింగ్ అయిపోగానే మెరీనా బీచ్‌కి వెళ్లి భోరుమని ఏడ్చేశారు. ‘ఇక సినిమాలొద్దు.. ఇంటికెళ్లిపోదాం’ అనికూడా అనిపిస్తే ఘంటసాల రఘురామయ్య ఓదార్చారు. ‘పుల్లయ్య తీరే అంత. ఆయనకు నోటి దురుసు కాస్త ఎక్కువ. పైగా పెద్దాయన’ అంటూ కాస్త లాలించి, మనసు మార్చారు.
Also Read: ఫ్లాష్ బ్యాక్: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగరెట్!
ఏళ్లు గిర్రున తిరిగాయి. అక్కినేని సూపర్ స్టార్ అయ్యారు. ఓరోజు పి.పుల్లయ్య ‘అర్ధాంగి’ కథ రాసుకొని, నాగేశ్వరావుని కలవడానికి వచ్చారు. పుల్లయ్య వచ్చారన్న విషయం తెలుసుకొని, ఆఫీసుకు రావాలనే రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు అక్కినేని. ఆ తరవాత కథ చెప్పమన్నారు. కథ నచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి ప్రధాన తారాగణం. అన్నయ్యగా ఎన్టీఆర్ నటించాలి. ఆయనది వెర్రి బాగులోడి పాత్ర. పులయ్యతో పేచీ పెట్టుకోవాలని ఫిక్సయిపోయిన అక్కినేని ‘అన్నయ్య పాత్ర నేను వేస్తా’ అన్నారు. ‘అదేంటి? అక్కినేని అన్నయ్య.. ఎన్టీఆర్ తమ్ముడు అంటే జనం ఒప్పుకోరు` అని అభ్యంతరం చెప్పారు. కానీ అక్కినేని ఒప్పుకోలేదు. ‘బ్రదర్ కాకపోతే.. జగ్గయ్యని తీసుకోండి. మా కాంబినేషన్ కూడా బాగుంటుంది’ అనడంతో.. పులయ్యకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. చివరికి ఓ నిర్ణయానికి వచ్చి ‘సరే..’ అన్నారు. అప్పటికీ అక్కినేని తగ్గలేదు. ‘బాగా ఆలోచించుకోండి పుల్లయ్య గారు. రేపు సినిమా అటూ ఇటూ అయితే… నన్ను బూతులు తిట్టినా తిడతారు’ అంటూ మనసులో ఉన్నది కక్కేశారు. అప్పుడు అర్థమైంది అక్కినేని ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.
Also Read: ఫ్లాష్ బ్యాక్: జమునని ఎందుకు బ్యాన్ చేశారు?
‘భలేవాడివయ్యా.. అప్పటి విషయం ఇప్పటికీ గుర్తుందా. ఏదో పెద్దవాడ్ని కదా… చనువు కొద్దీ ఆరోజు నిన్ను తిట్టానంతే’ అంటూ ఏదో సర్ది చెప్పబోయారు. ‘నేను గుర్తు పెట్టుకోవడం పక్కన ఉంచండి. మీక్కూడా ఆ విషయం గుర్తుంది కదా, అంటే.. తప్పు చేశానని మీకు అనిపించినట్టే కదా’ అంటూ మళ్లీ గుచ్చారు. అలా ఏళ్ల తరబడి తన మనసులో ఉన్న బాధని పుల్లయ్య ముందు కక్కేశారు అక్కినేని. చివరికి అక్కినేని చెప్పినట్టే ఎన్టీఆర్ స్థానంలో జగ్గయ్య వచ్చారు. ‘అర్ధాంగి’ సూపర్ హిట్ అయ్యింది. ఈ విషయాన్ని అక్కినేని తన ఆత్మకథలో రాసుకొన్నారు కూడా.