తెలుగు ప్రేక్షకుల సినీ రాకుమారి కృష్ణకుమారి ఇక లేరు. బుధవారం బెంగళూరులో తుది శ్వాస విడిచారు. తెలుగు చిత్రపరిశ్రమకు రెండు కళ్లు అయినటువంటి ఎన్టీఆర్ (25), ఏయన్నార్ (18)… ఇద్దరితోనూ కృష్ణకుమారి సినిమాలు చేశారు. అయితే… ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం కాంతారావు (28)తోనే. వాటిలో ఎక్కువ జానపద చిత్రాలే. తెలుగు ప్రేక్షకుల నన్నిప్పటికీ గుర్తుంచుకుంటున్నారంటే ఆ జానపద చిత్రాలే కారణమని పదేళ్ల క్రితం ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
కృష్ణకుమారి తెలుగమ్మాయి అయినప్పటికీ చీరకట్టుకోవడం సరిగా రాదట. అక్కినేని నాగేశ్వరరావు (ఏయన్నార్)తో ‘భార్యాభర్తలు’ సినిమా చేస్తున్నప్పుడు ఈ సంగతి హీరోకి తెలిసింది. ఆల్రెడీ నాటకాల్లో మహిళగా నటించిన (ఆడ వేషాలు వేసిన) అనుభవం అక్కినేనికి ఉండడంతో నాకు చీరకట్టు నేర్పించారని కృష్ణకుమారి చెప్పుకోచ్చారు. అంతే కాదు… నేను ఇన్నాళ్లు బతికున్నానంటే ఎన్టీఆర్ గారే కారణమన్నారు. ‘లక్షాధికారి’లోని ‘మబ్బులో ఏముంది..’ పాటను సముద్రపు అలల ఒడ్డున చిత్రీకరిస్తుంటే ఉన్నట్టుండి ఒక పెద్ద అల వచ్చి కృష్ణకుమారి మీద పడిందట. అసలే ఆమెకు ఈత రాదు, దానికి తోడు నీళ్లు మింగేశారు. సముద్రంలోకి కొట్టుకుపోతానేమో అనుకున్న సమయంలో నా చేయి వదలకుండా ఎన్టీఆర్ గట్టిగా పట్టుకోవడంతో బతికానని కృష్ణకుమారి తెలిపారు. ‘బందిపోటు’ చిత్రీకరణలోనూ ఎన్టీఆర్ సహాయంతో ప్రమాదం నుంచి కృష్ణకుమారి బయటపడ్డారు. ఇలా రెండుసార్లు ఎన్టీఆర్ ఆమెను కాపాడారు. తెలుగులో ఎన్నో మంచి చిత్రాలు చేసి, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన కృష్ణకుమారి స్వర్గస్థులు కావడంతో పలువురు సంతాపం వ్యక్తం చేశారు.