పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంతమంది చెబుతుంటారు. అది మరీ అతిశయోక్తి కానీ, కొన్ని పాత్రలు చేసేటప్పుడు నిష్టగా నియమంగా ఉండడం మాత్రం సర్వ సాధారణంగా కనిపించే వ్యవహారమే. ముఖ్యంగా దేవుడి పాత్రలు వచ్చినప్పుడు మరింత ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉంటారు. మాంసాహారానికి దూరంగా ఉండడం, కటిక నేలపై పడుకోవడం ఇవన్నీ నటీనటులు ఆచరించే అంశాలే. కానీ… ఏఎన్నార్ శైలి వేరు. ఆయనకు నటన అంటే ప్రాణం. కానీ… పూర్తిగా నాస్తికుడు. దేవుడ్ని నమ్మరు. ఇక నియమాలూ, నిష్టల మాటేంటి? ఓసారి ‘చెంచులక్ష్మి’ షూటింగ్ జరుగుతోంది. అక్కినేని అందులో మహా విష్ణువు పాత్ర పోషించారు. అదే స్టూడియోలోని పక్క ఫ్లోరులో ఎన్టీఆర్ షూటింగ్ జరుగుతోంది. మహా విష్ణువు గెటప్ లో అక్కినేని ఎలా ఉన్నారో చూడాలనిపించింది ఎన్టీఆర్కు. అందుకే షూటింగ్ గ్యాప్ లో ‘చెంచులక్ష్మి’ సెట్ కి వెళ్లారు. వెళ్లగానే మహావిష్ణువు అవతారంలో ఉన్న అక్కినేని కనిపించారు. కానీ ఎన్టీఆర్ షాకైంది ఏమిటంటే… ఆ గెటప్ లో ఉండి కూడా అక్కినేని సిగరెట్ ముట్టించడం.
ఎన్టీఆర్ కు అసలే దేవుడంటే భక్తి. ఆయన నియమ నిష్టల గురించి తెలిసిందే. ”అదేంటి బ్రదర్.. మీరు వేస్తున్న వేషమేంటి? చేస్తున్న పనేంటి? దేవుడి గెటప్ లో ఉండి సిగరెట్ తాగుతారా” అంటూ కాస్త మందలించే ప్రయత్నం చేశారు. కానీ ఏఎన్నార్ వినిపించుకోలేదు. ”నేను నాస్తికుడ్ని. ఇలాంటివేం నమ్మను. దేవుడికి దండమే పెట్టను” అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. ”మీ నమ్మకాలు మీవి. మా నమ్మకాలు మావి. మీ కోసం కాకపోయినా.. మీ చుట్టు పక్కల ఉన్నవారికోసమైనా మీరు మీ ప్రవర్తన మార్చుకోవాలి” అంటూ సర్ది చెప్పాలని చూశారు. కానీ అక్కినేని మొండిఘటం కదా. సిగరెట్ పడేయ్యలేదు. అప్పటికి ఆ ఎపిసోడ్ అలా ముగిసింది. కానీ విచిత్రం ఏమిటంటే… దేవుడంటే నమ్మకం లేని అక్కినేని ఆ తరవాతి కాలంలో భక్తుడి పాత్రలు ఎక్కువగా పోషించడం. ‘భక్త తుకారం’ లాంటి చిత్రాలు ఆయన్ని వెదుక్కొంటూ వచ్చాయి. ఇదే విషయం ఎన్టీఆర్కు చెప్పారు ఏఎన్నార్. ”దేవుడంటే నాకు నమ్మకం లేదు. కానీ నాచేత దర్శకులు దేవుళ్లకు దండాలు పెట్టించేశారు. ఇదేం మాయో” అని.