యూత్ హీరోల్లో.. ఎంటర్టైన్మెంట్లో నానిని కొట్టేవాడే లేడు. తన కామెడీ టైమింగ్ సూపర్బ్ గా ఉంటుంది. అయితే.. ఈమధ్య నాని సీరియస్ టైప్ కథల్ని ఎంచుకోవడంతో ఆ కామెడీ టైమింగ్ మిస్సయ్యింది. ఇప్పుడు మళ్లీ… నాని తన రూట్లోకి వెళ్లిపోయాడు. `అంటే.. సుందరానికి` తో. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ తెరకెక్కించింది. జూన్ 10న వస్తోంది. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేశారు. 2 నిమిషాల 16 సెకన్ల ట్రైలర్ మొత్తం ఫన్ రైడ్ గా సాగిపోయింది.
సుందర్ ప్రసాద్ అనే ఓ `వంశోద్ధారకుడి` కథ. ఆ కుటుంబంలో అంతా ఆడపిల్లలే. ఒక్క సుందర్ తప్ప. సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ కుటుంబం. సుందర్‌పై అతి ప్రేమతో.. అతి జాగ్రత్తతో యజ్ఞాలు, హోమలు, పూజలు, పునస్కారాలు, తాయెత్తులు… ఇలా అన్నీ అతనిపై గుమ్మరిస్తుంటారు ఇంట్లోవాళ్లు. మడి – తడి – ఆచారం ఇలా చాలా ఉంటాయి. ద్విచక్రవాహన గండం ఉందని… డొక్కు స్కూటర్ కూడా ఇవ్వడం మానేస్తారు. అలాంటి.. అబ్బాయి ఓ క్రీస్టియన్ అమ్మాయి ప్రేమలో పడిపోతాడు. ఆ తరవాత ఏం జరిగిందన్నదే కథ. రెండు మతాల ఇష్యూని ఈసారి బాగా ఎంటర్‌టైన్‌తో డీల్ చేసినట్టు అనిపించింది. నాని కామెడీ టైమింగ్ కేక పుట్టించేలా ఉంది. `అంటే..` ఏం జరిగిందన్నదానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. `అంటే..` అంటే.. ఇంకేదో సస్పెన్స్ ఈ సినిమాలో ఉందన్నమాట. కాస్టింగ్ పరంగా, టెక్నికల్ పరంగా ఈ సినిమా సౌండింగ్ గానే ఉంది. ఈ వేసవిలో ఫుల్ మీల్స్ అందించడ ఖాయం.