TELUGU360 RATING : 3/5
మన బలం మనం తెలుసుకోవడమే సగం విజయం. నాని బలం.. ఎంటర్టైన్మెంట్. తను `నవ్వించాలి` అని ఫిక్సయినప్పుడు, అలాంటి కథ దొరికినప్పుడు తనని ఎవ్వరూ ఆపలేరు. ఇది వరకు చాలా సినిమాల విషయంలో ఇదే నిజమైంది. అయితే ఈమధ్య నాని కాస్త సీరియస్ కథల్ని ఎంచుకోవడం మొదలెట్టాడు. దాంతో ఫలితాలూ తారుమారు అయ్యాయి. అందుకే… ఇప్పుడు మళ్లీ తన దారిలో తానొచ్చాడు. అదే… `అంటే.. సుందరానికీ`. ఈ టైటిల్, సెటప్, అందులో నాని గెటప్ చూస్తే చాలు. వివేక్ ఆత్రేయ ఈసారి ఎలాంటి కథతో వచ్చాడో చెప్పడానికి. `ఈ ఆవకాయ్ సీజన్` మాదే అంటూ ముందు నుంచీ ఊరిస్తూ.. ఊరిస్తూ వచ్చిన ఈ సుందరం.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరి సుందరం సంగతేంటి? ఎలా ఉన్నాడు? ఆవకాయ్ ఘాటెంత?
సుందర్ ప్రసాద్ (నాని) విశ్వనాథ శాస్త్రి గారి మనవడు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. తండ్రి (నరేష్) వంశ గౌరవాన్ని ప్రతిష్టనీ కాపాడాలని తహతహలాడుతుంటాడు. ఆచారం, సంప్రదాయాలు, యజ్ఞాలూ, హోమాలూ.. ఈ తంతు ఎక్కువ. పైగా జాతకాలు, జ్యోతిష్యాలపై నమ్మకం. జ్యోతిష్యుడు (శ్రీకాంత్ అయ్యంగార్) ఏం చెబితే అది తు.చ తప్పకుండా పాటిస్తుంటాడు. చిన్నప్పుడు సుందరానికి సినిమాల్లో నటించే ఛాన్స్ వస్తుంది. అందుకోసం అమెరికా కూడా వెళ్లాల్సివస్తుంది. కానీ అదంతా భూటకం అని తేలాక… సుందరాన్ని మరింత కట్టుదిట్టంగా పెంచడం మొదలెడతాడు. దాంతో సుందరానికి నిజంగానే అమెరికా వెళ్లాలన్న పిచ్చి పట్టుకుంటుంది. పైగా అమెరికా ప్రయాణానికి తన ప్రేమకథ కూడా బలమైన కారణంగా మారుతుంది. తన చిననాటి క్లాస్‌మెట్ లీల (నజ్రియా) అంటే సుందర్‌కి చాలా ఇష్టం. కానీ వాళ్లది క్రీస్టియన్ కుటుంబం. లీల కూడా క్రమంగా సుందరాన్ని ఇష్టపడుతుంది. కానీ… ఎవరింట్లో చెప్పినా ఒప్పుకొనే పరిస్థితి లేదు. అందుకే ఇద్దరూ తమ తమ ఇళ్లళ్లో ఒక్కొక్క అబద్ధం ఆడాలని ఫిక్సవుతారు. ఆ అబద్ధాల వల్ల.. వాళ్ల జీవితం, ప్రేమకథ మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఇంతకీ ఆ అబద్ధాలేంటి? వాటి వల్ల.. సుందర్, లీల ఇళ్లల్లో ఏం జరిగింది? ఎవరెవరు ఎలా రియాక్ట్ అయ్యారు? అనేది మిగిలిన కథ.
ఓ బ్రాహ్మణ అబ్బాయి – ఓ క్రిస్టియన్ అమ్మాయి మధ్య ప్రేమ కథ ఇది. ఇలాంటి కథల్ని ఎలాగైనా చెప్పొచ్చు. రక్తపాతం సృష్టించొచ్చు, 2022లో కూడా ఈ మతాలేంటి? ఆచారాలాలేంటి? అంటూ స్పీచులు దంచి కొట్టొచ్చు. కానీ.. అలాంటివేం లేకుండా అంతే గాఢమైన ముద్ర వేసేలా మలిచాడు.. వివేక్ ఆత్రేయ. కొంచెం వినోదం, కొంచెం ఎమోషన్, కొంచెం సంప్రదాయం, ఇంకొంచెం మోడ్రన్ థాట్.. ఇవన్నీ కలగలిపి, అందరికీ నచ్చేలా ఓ సినిమాని తయారు చేయగలిగాడు. వివేక్ ఆత్రేయలో నచ్చే విషయం ఏమిటంటే.. తను ఈతరం కుర్రాడు. కానీ.. తనకు సంప్రదాయాలకు ఎక్కడ విలువ ఇవ్వాలో? ఎక్కడ ఎమోషన్ని గుర్తించాలో బాగా తెలుసు. ఆ విషయం.. తన రైటింగ్ లో అర్థమైంది.
సుందరం – లీల చిన్నప్పుడు క్లాస్మేట్స్ గా ఉన్నప్పుడు `తొలి అడుగుఉ` అనే ఓ నాటకం వేస్తారు. కులాలు, మతాల మధ్య గోడల్ని.. చదువు చెరిపేస్తుందన్నది, అందరూ కలిసి మెలసి ఉండాలన్నది ఆ నాటక తాత్పర్యం. నాటకం చూసి అందరూ చప్పట్లు కొడతారు. హీరో, హీరోయిన్ల తల్లిదండ్రులతో సహా. నిజంగా పెరిగి పెద్దయి.. ఆ నాటకంలో చెప్పిన నీతిని నిజం చేయాలనుకుంటే మాత్రం.. ఎవరికీ చేతులు రావు. ఈ పాయింటే బలంగా చెప్పాలనుకొన్నాడు దర్శకుడు. దానికి సరదా సన్నివేశాలు రాసుకొని, ఎమోషన్ జోడించి, పాత్రల్ని బలంగా రాసుకొని – హృదయానికి హత్తుకొనేలా తీశాడు.
చిరంజీవి సినిమాలో జూ.చిరంజీవిగా సుందరానికి అవకాశం రావడంతో కథ మొదలవుతుంది. ఆ తరవాత అనుపమ పరమేశ్వరన్‌కి కాసేపు, హర్షవర్థన్‌కి కాసేపు, ఇద్దరికీ కలిపి కాసేపు తన కథని పార్టు పార్టులుగా చెప్పుకొంటూ పోతాడు. ఈ స్క్రీన్ ప్లే టెక్నిక్ బాగుంది. ఈ కథని స్ట్రయిట్ నేరేషన్లోనూ చెప్పొచ్చు. కానీ ఇంత ఆసక్తి వచ్చేది కాదేమో..? రొటీన్ కథల్ని కొత్తగా చెప్పడం ఈ తరం అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో వివేక్ ఆత్రేయ బాగానే కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. `బ్రోచేవారెవరురా` కూడా రొటీన్ కిడ్నాప్ కథే. దాన్ని కూడా వెరైటీ స్క్రీన్ ప్లేతో ముందుకు నడిపాడు. ఈసారీ.. అంతే. కథ ముందుకీ వెనక్కీ వెళ్తూ వస్తూ ఉంటుంది. ఇలాంటి చోట ఎక్కువగా కన్ఫ్యూజన్ మొదలవుతుంది. అలాంటి ప్రమాదం ఈ సినిమా విషయంలో జరగలేదు.
నాని, నరేష్‌ల మధ్య సన్నివేశాలు, నాని – హర్షవర్థన్ ట్రాక్, నాని – రాహుల్ రామకృష్ణన్ సీన్లు ఇవన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా తండ్రీ కొడుకుల సంభాషణలు సహజంగా అనిపించాయి. పిల్లలు ఎందుకు పుడతారు? ఎందుకు పుట్టరు? అనే కాంప్లికేటెడ్ విషయాన్ని… రాహుల్ రామకృష్ణన్ తో అర్థమయ్యే రీతిలో వివరించడం బాగుంది. హీరో, హీరోయిన్లు చెప్పే రెండు అబద్ధాలూ ఈ కథకు మూలం. ఆ అబద్ధాలేంటో ఇప్పుడే చెప్పేస్తే సినిమా చూసేటప్పుడు ఆ థ్రిల్ ఉండదు. కాకపోతే. ఇద్దరూ ఒకే అబద్ధాన్ని చెప్పేస్తే బాగుండేది కదా, ఇంత కాంప్లికేషన్ ఉండేది కాదు కదా? అనిపిస్తుంది. దర్శకుడు తన కథని తానే కావాలని కాంప్లికేట్ చేసుకొని, ఆ చిక్కుముడిని తానే విప్పుకుంటూ వచ్చాడు. లీల చెప్పిన అబద్ధాన్ని దర్శకుడు ఓచోట నిజం చేశాడు. మళ్లీ అబద్ధం అన్నాడు. అది దర్శకుడు తనకు తాను తీసుకొన్న లిబర్టీ. ఈ కథకు అది అవసరం లేదు కూడా.
చిన్నప్పటి ఎపిసోడ్లు, లీలా ప్రేమకథ.. ఇవన్నీ చాలా లెంగ్తీగా అనిపించాయి. వాటిని ట్రీమ్ చేసుకోవచ్చు. రచయితే దర్శకుడు అయితే స్వార్థం ఎక్కువగా ఉంటుంది. తాను రాసుకొన్న ప్రతీ సీన్ అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ట్రిమ్ చేయాల్సిన బాధ్యత ఎడిటర్ దే. సీన్ బాగున్నా సరే, ఫ్లోకి అడ్డు పడుతోందంటే, కథని సాగదీస్తోందంటే, దాన్ని నిర్దాక్షణ్యంగా కట్ చేయాలి. ఈ సినిమాలో అలా ట్రిమ్ చేయాల్సిన సీన్లు చాలా కపిస్తాయి. దాదాపుగా మూడు గంటల సినిమా ఇది. కనీసం మరో 30 నిమిషాలు కుదిస్తే.. కథనంలో వేగం వచ్చేది. అప్పుడు సుందరం మరింత నచ్చేసేవాడు.
ఆచారాలను గౌరవించినట్టు అవకాశాల్ని కూడా గౌరవించాలి కదండీ…
జల్లెడ వచ్చి గుండెసూది నెత్తిమీద బెజ్జం ఉందని వెక్కిరించిందట..
పద్ధతులు, ఆచారాల ముసుగులో లోపలున్న మనిషిని చంపుకోకూడదు.
ఆలోచన కూడా ఒక అంటువ్యాధే. ఒకడు బాగా ఆలోచించడం మొదలెడితే.. అందరూ బాగానే ఆలోచిస్తారు.
ఇలాంటి డైలాగులు అక్కడక్కడా మెరిశాయి. వినోదాన్ని ఎంత సెటిల్డ్ గా చూపించాడో, ఎమోషన్‌నీ అంతే సెటిల్డ్ గా చూపించాడు దర్శకుడు. రెండింటినీ బాలెన్స్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.
నాని తన సహజమైన నటనతో మరోసారి ఆకట్టుకొన్నాడు. తను ఈజీగా ఈ కథని, సుందరం పాత్రనీ ఆకళింపు చేసుకొన్న విషయం ప్రతీ సీన్లోనూ అర్థమవుతూ ఉంటుంది. ఇంట్లో నాన్న తిట్లు, చివాట్లు తింటున్నప్పుడు ఒకలా, బాసు హర్షవర్థన్ తో సెటైర్లు వేస్తున్నప్పుడ మరోలా.. తనలోని నట చాతుర్యాన్ని ప్రదర్శించాడు. నజ్రియాకు ఇదే తొలి తెలుగు సినిమా. కానీ తనకు ముందు నుంచీ తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాతో అది మరింత పెరుగుతుంది. నరేష్ ని పద్ధతిగా వాడుకుంటే సీన్లు ఎంత బాగా పండుతాయో ఈ సినిమా మరోసారి చాటి చెప్పింది. చివరి సన్నివేశాల్లో రోహిణి తన నటనతో నిలబెట్టారు. నదియా పాత్ర కూడా హుందాగా ఉంది. హర్షవర్థన్, రాహుల్ రామకృష్ణ… సీరియస్ గా ఉంటూనే నవ్వించారు.
వివేక్ సాగర్ పాటలు పెద్దగా ఆకట్టుకోవు. ఈ సినిమాలో అదే మైనస్. కానీ నేపధ్య సంగీతంతో అదరగొట్టాడు. వివేక్ రచయితగా, దర్శకుడిగా మెప్పించాడు. చాలా చోట్ల తన పనితనం, పెన్నుతనం కనిపించాయి. కానీ… ప్రతీ సన్నివేశాన్నీ డిటైల్డ్ గా చూపించాలనుకోవడం ప్రధానమైన లోపం. మూడు గంటల పాటు ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టడం ఈరోజుల్లో మామూలు విషయం కాదు. సినిమాపై, రాసిన సన్నివేశాలపై ఎంత ప్రేమ ఉన్నా, వాటిని కుదించుకోవాల్సిందే.
మొత్తానికి సుందరం… బాగున్నాడు. కుటుంబ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతాడు. చాలా చిన్న కథని.. లోతైన విషయాన్ని సరదాగా చెప్పిన ఈ ప్రయత్నం ఆకట్టుకుంటుంది.
ఫినిషింగ్ టచ్: బహు సుందరం
TELUGU360 RATING : 3/5