నిజానికి, ప్రతిపక్ష పార్టీలను ఏకతాటికి తెచ్చే మహా ప్రయత్నం కర్ణాటకలోనే ప్రారంభమైంది. కుమారస్వామి సీఎంగా ప్రమాణం చేస్తున్న సమయంలోనే దేశంలోని భాజపా వ్యతిరేక పార్టీలన్నీ చేతులు కలిపాయి. 2019 ఎన్నికల ముఖచిత్రం అక్కడే కొత్త మలుపు తీసుకుంది. ఆ తరువాత, ప్రతిపక్షాలన్నీ సమావేశం పెట్టుకుంటాయని అనుకున్నారు. కానీ, ఇంతవరకూ అలాంటి భేటీకి అవకాశం రాలేదు. ఆ దిశగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు చొరవ తీసుకుంటున్నారు. యూపీలో మాయావతీ, అఖిలేష్ యాదవ్ లు కలిస్తే బాగుంటుందని ఆమే సలహా ఇచ్చారు. ఫలితంగా అక్కడ జరిగిన వరుస ఉప ఎన్నికల్లో భాజపాకి తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలాయి. ఇదే తరహాలో 2019 లో కూడా 400 సీట్లలో పోటీ ప్రతిపాదను కూడా మమతా తెరమీదికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీతోపాటు ఇతర రాష్ట్రాల్లోని కొంతమంది ముఖ్యమంత్రులూ పార్టీల నాయకులు కూడా మహా కూటమి ఏర్పాటుకు సంసిద్ధంగానే ఉన్నారు. వీరందరితో లక్నోలో ఒక సదస్సు నిర్వహించేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం.
ఆదివారం నాడు నీతీ ఆయోగ్ సమావేశం ఢిల్లీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరౌతున్నారు. ముఖ్యంగా భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందనే కథనాలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారనీ, పనిలోపనిగా ఆయన కూడా జాతీయ రాజకీయాల వ్యూహంతోనే ఢిల్లీకి వెళ్తున్నారనే సమాచారమూ తెలిసిందే. ఈ సమావేశానికి మమతా కూడా హాజరౌతున్నారు. దీంతో రేపటి పరిణామాలపై కొంత ఆసక్తి నెలకొంది..
లక్నో సదస్సుకు సంబంధించి ఇంకా తేదీ ఖరారు కావాల్సి ఉంది. వచ్చే నెల తొలివారంలో జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సదస్సు వేదికగా మహాకూటమి అధికారిక ప్రకటన చేయాలన్న ఉద్దేశంతోనే మమతా ఉన్నారని అంటున్నారు. దీన్లో భాగంగా ముందుగా చెన్నై వెళ్లి, డీఎంకే స్టాలిన్ తో చర్చిస్తారనీ, ఆ తరువాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రా ముఖ్యమంత్రులతో కూడా ఆమె భేటీ అయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి, మహా కూటమి ఏర్పాటు దిశగా చకచకా పావులు కదులుతున్నాయన్నది వాస్తవం. లక్నో భేటీ ఖరారు అయితే ఆ దిశగా కీలకమైన ముందడుగు పడినట్టు అవుతుంది.