పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ తీసిన అజ్ఞాతవాసిపై ఒక్క పూటలోనే ఎక్కడలేని దాడి జరగడం యాదృచ్చికం కాదని రాజకీయ సినిమా వర్గాలు భావిస్తున్నాయి. ఆ చిత్రం గొప్పది కాకున్నా మరీ అంతగా తిట్టిపోయాల్సింది కూడా కాదని వారు విశ్లేషిస్తున్నారు. అటు ప్రత్యర్థులు ఇటు మిత్రుల ముసుగులోని శత్రువులు పరిశ్రమలో పోటీదార్లు అన్నిటినీ మించి మీడియాలో వ్యతిరేకులు కూడబలుక్కుని పవన్‌ను ప్లాప్ హీరోగా నిరూపించే కుట్ర చేశారన్నది అభిమానుల అభియోగం. రాజకీయాలలోనూ ఆయన కాలుమోపారు గనక శత్రువులు పెరిగారట. హీరోగా ఉన్నతస్థానంలో వున్న ఆయన రాజకీయంగానూ యవత ఆదరణ పొందడం ఇలాంటి వారందరికీ ఆందోళన కలిగిస్తున్నది. కమల్‌హాసన్ రజనీ కాంత్ వంటివారే ఆపసోపాలు పడుతుంటే తనకంటూ అనుకోగానే పార్టీ పెట్టి ఎన్నికల ప్రచారంలోకి దూకి జయాపజయాలను ప్రభావితం చేసిన పవన్ కళ్యాణ్ ఎపి తెలంగాణలలో కూడా అభిమానం నిలబెట్టుకోవడం అభిమానులను ఎంత సంతోషం కలిగిస్తున్నదో అవతలివారికి అంతే పెద్ద హెచ్చరిక అనిపిస్తున్నదట. రేపు ఆయన ఏమవుతాడనేది ఈ రోజు ఆయన సాధించే వివిధ రకాల విజయాలపై ఆధారపడి వుంటుంది గనక ఎక్కడికక్కడ దెబ్బ వేయాల్సిందేనని నిర్ణయానికి వచ్చేశారట. కొంతమంది విమర్శకులకు విపరీతమైన ప్రచారం కల్పించడంలోనూ అదే ప్రభావం పనిచేస్తుందని వారి విశ్లేషణ. వెంకటేశ్‌ను సీన్లు జోడించితే మరుక్షణంలో దాన్ని కూడా తిట్టిపోయడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ మరుసటి రోజునే వచ్చిన బాలయ్య చిత్రం కూడా పాత మూసలోనే వున్నా ఆకాశానికెత్తి ఘన విజయం ముద్ర వేశారని వారు భావిస్తున్నారు. గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి ఖైదీ150 చిత్రాల విషయంలో ఇలాటి తేడానే చూపించారని తర్వాత శాతకర్ణి వసూళ్లు ఎలా వున్నాయో తెలిసిందని కూడా వారి ఫిర్యాదుగా వుంది. అయితే ఇలాటి వాటితో ఆయనకున్న ఆదరణ చెదిరిపోయేది కాదని పవన్ శిబిరం విశ్వసిస్తున్నది. కాబట్టే ఎవరికీ సూటిగా జవాబు చెప్పనసరం లేదని భావిస్తున్నారు. అయితే కథల ఎంపిక లోనూ చిత్రణలోనూ తమ నాయకుడు మరింత జాగ్రత్త వహించాల్సిందేనని మాత్రం స్సష్టం చేస్తున్నారు.