వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొత్త లొల్లి ప్రారంభమైంది. సగం మంది ఎమ్మెల్యేలకు ఈ సారి టిక్కెట్లు నిరాకరించబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. వైసీపీఎల్పీ భేటీలో సీఎం జగన్ సర్వే ప్రస్తావన తెచ్చారు. సర్వే జబితాలో పేర్లుంటేనే టిక్కెట్ ఇస్తామని..అందులో మొహమాటాలేమీ లేవని తేల్చేసారు. దీంతో ఎమ్మెల్యేల్లో దడ ప్రారంభమయింది. ప్రజల్లో వ్యతిరేకత పేరు చూపించి తమకు టిక్కెట్ నిరాకరిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు.
నిజానికి వైసీపీ నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచారు కానీ చిన్న పనులు కూడా చేయించలేక పోయారు. చివరికి తమ పార్టీ నేతలకు ఆర్థికంగా కూడా మేలు చేయలేపోయారు. దీంతో సహజంగానే వారిపై అసంతృప్తి ఉంటుంది. దీనికి కారణం ప్రభుత్వమే కానీ ఎమ్మెల్యేలు కాదు. నిధులు ఇచ్చినా… బిల్లులు పెండింగ్లో పెట్టకపోయినా సమస్య ఉండదు. కానీ అదే పెద్ద సమస్య అయిపోయింది.ఇప్పుడు సర్వేల్లో తమపై అసంతృప్తి కాకుండా పాజిటివ్ ఎలా వస్తుందని ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యే కేంద్రంగా చేసే సర్వేలో.. ప్రభుత్వంపై వ్యతిరేకత గురించి ప్రశ్నించరు కాబట్టి.. ఎమ్మెల్యే బలి అవడం ఖాయమని వైసీపీలో టెన్షన్ ప్రారంభమయింది.
జిల్లాల్లో ఉన్న రాజకీయాలను బట్టి ఇప్పటికే ఫలానా ఎమ్మెల్యేకు ఈ సారి టిక్కెట్ రాదన్న చర్చలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గాల్లో పట్టు సాధించి ప్రత్యామ్నాయ నాయకత్వం లేని చోట్ల టిక్కెట్లకు ఢోకా లేదు. కానీ రిజర్వుడు నియోజకవర్గాలతో పాటు… బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం ఉన్న చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చే చాన్స్ ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు…ఇంకాఖర్చు పెట్టుకోవడం మంచిదాకాదా. అనే ఆలోచనలు కూడా ప్రారంభించారు.