ఎలాగైనా గెలవడానికి హామీలు ఇచ్చేసి నెరవేర్చలేని తెలుగుదేశం నిస్సహాయతవల్లా, నెరవేర్చగలిగి వుండీ నిర్లక్ష్యం చూపుతున్న బిజెపి ప్రభుత్వం వల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలే నష్టపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, దేశ ప్రధానిగా నరేంద్రమోదీ పాలన ప్రారంభించి రెండేళ్ళు పూర్తయ్యాయి. కాంగ్రస్ హయాంలోని అవినీతిని, బాధ్యతా రాహిత్యాన్నీ తరిమేసిన ప్రధానీ, కట్టబట్టలతో నిలబడిపోయిన రాష్ట్రానికి దశదిశల నిర్దేశానికి కట్టుబడి కృషి చేస్తున్న ముఖ్యమంత్రీ ఎంతైనా అభినందనీయులే! ప్రసంశనీయులే
చేసిన పనుల్ని ప్రచారం చేసుకోవడంలో మోదీ – బాబు పోటాపోటీగావుంటారు. అయినా కూడా, వారి తప్పులు ఒప్పులైపోవు. వారి వైఫల్యాలు సాఫల్యాలైపోవు.
ప్రధాని అయ్యాక దేశవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధి రేటు 4.8 శాతం నుండి సగానికి పడిపోయింది. 256 జిల్లాల్లో కరవు నివారణ చర్యలు ఫలితాలను ఇవ్వడంలేదు.ఎన్నికల ముఖ్య వాగ్దానమైన నల్లధనాన్ని విదేశాలనుచి తీసుకు రావడంలో విఫలమయ్యారు. పనామా పేపర్ల ద్వారా 500 మంది పేర్లు బయటపడితే వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా చూపలేదు. రూ. 9000 కోట్లకు బ్యాంకులకు టోకరా పెట్టిన విజయ్ మాల్యా వైపు పిచ్చి చూపులు చూడటమే తప్ప ఏమీ చేయలేకపోతూండటం. మోడీ వచ్చాక దళితులు, మైనార్టీలు, హేతువాదులు, లౌకిక ప్రజాస్వామ్య శక్తులు, విద్యార్థులపై దాడులు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 22 సార్లు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఎప్పుడు దిగి వస్తాయో తెలియని పరిస్ధితి వుంది.
మాజీ ప్రధాని హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాకి అంత్య క్రియలు చేసేశారు. విభజన చట్టంలోని ఇతర అంశాలను పక్కన పడేసి రొటీన్ గా రాష్ట్రాలకు ఇచ్చే నిధుల మొత్తాలను చూపించి ఆంధ్రప్రదేశ్ ఉద్దారకులుగా బిల్డప్ ఇవ్వడానికి చేతగాని ప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ప్రయివేటు రంగానిక పూర్తిగా తెరలేపేశారు. ఆసియాలోనే పెద్దదైన విజయవాడ బస్ స్టేషన్ ను స్వరాజ్ మైదాన్ ను, చివరికి రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా కాంట్రాక్టర్లకు వొదిలేశారు. రుణమాఫీ పేరుతో రైతుల్లో భ్రమలు కల్పించి పాక్షికంగా మాఫీ చేసి మిగిలిన రైతుల రుణభారాన్ని పెంచేశారు. తన చేతిలో లేని కాపురిజర్వేషన్ల హామీ ఇచ్చేసి కులాల మధ్య నిప్పురాజేశారు. ముద్రగడ దీక్ష విరమింపజేయడానికి ప్రభుత్వమే ఆయన ముందు నిలబడిందన్న ఇంప్రెషన్ కు కారకుడయ్యారు. సాక్షి టివి ప్రసారాలు నిలుపుదల చేయించి మీడియా గొంతు నొక్కే పని మొదలు పెట్టేశారు. ముద్రగడ గురించి డాక్టర్లు చెప్పింంది రాసుకోవడంతప్ప అక్కడి వాతావరణం చూడటానికి కూడా వీలు లేకుండా విలేకరులను నిషేధించారు. అసలు ఆదారిలో రాకపోకలు లేకుండా ప్రజల్నే నిషేధించారు.
ఈ సమస్యలన్నీ తాత్కాలికమేననుకున్నా, ప్రత్యేకహోదా విషయంలో బిజెపి మోసాన్ని, కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు దాటివేతల్ని ప్రజలు మరచిపోరు.
ఎందుకంటే అవి సెంటిమెంట్లుగా మారి ప్రజల ఆలోచనల్లో స్ధిర పడిపోయాయి.