రాజ్ తరుణ్ ది మంచి హుషారైన బాడీ లాంగ్వేజ్. అల్లరి, ఆకతాయి పాత్రలకు తను బాగా నప్పేస్తాడు. చాలాకాలం తరవాత తన బాడీ లాంగ్వేజ్ కి సూటైన కథ ఒకటి చేస్తున్నాడు. అదే అనుభవించు రాజా. అన్నపూర్ణస్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకుడు. ఈ సినిమాలోంచి తొలి పాట ఇప్పుడు బయటకు వచ్చింది. గోపీ సుందర్ స్వరాల్ని అందించారు. భాస్కర భట్ల రవికుమార్ రచించారు. రామ్ మిరియాల పాడాడు. ఇదో మంచి పెప్పీ సాంగ్. ఊర్లో దసరా బుల్లోడు లాంటి రాజ్ తరుణ్.. జీవితాన్ని అనుభవించే పద్ధతుల్నీ, సూత్రాల్నీ ఊర్లోవాళ్లకు బోధిస్తుంటాడు. అదే ఈ పాటలో సారాంశం.
”అడిగేదెవడు నిన్ను
ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను రాజా
అనుభవించు రాజా” అంటూ మంచి బీట్ తో మొదలైంది.
”మొలతాడైన గానీ
మనతో రాదు అని
త్వరగా తెలుసుకోరా రాజా
అనుభవించు రాజా” అంటూ జ్ఞానబోధ చేశాడు.
”ఆలోచిస్తే బుర్రపాడు – అందుకనే ఆడిపాడు
సంపాదించేడం అంతా దాచేడం
తిండం తొంగోడం -రోజూ ఇంతేనా
కొంచెం సరదాగా, కొంత సరసంగా
ఉంటే తప్పేంటి మనిషై పుట్టాక….” అంటూ జీవన తత్వం ధారబోశాడు. రాజ్ తరుణ్ స్టెప్పులు, తన మేనరిజం ఇవన్నీ బాగా కుదిరాయి. మొత్తానికి ఓ మంచి పాటతో `అనుభవించురాజా` పాటల ప్రయాణానికి శ్రీకారం చుట్టేశారు. గోపీ సుందర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. తన నుంచి ఆ ఆల్బమ్ నుంచి మరిన్ని మంచి పాటలు ఆశించొచ్చు అనిపిస్తోంది.