బాలివుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈరోజు చాలా మంచి ప్రశ్న లేవనెత్తారు. “దేశంలో అసహనం పెరిగిపోతోందని ఇంతకాలం గగ్గోలు పెడుతూ అవార్డులు వెనక్కి ఇచ్చినవారందరూ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలయిపోగానే అకస్మాత్తుగా నిశబ్ధం అయిపోయారెందుకు? ఇప్పుడు వారి నిరసనలు ఎందుకు ఆగిపోయాయి? ఇప్పుడు ఎవరూ తమ అవార్డులను ఎందుకు వెనక్కి ఇవ్వడం లేదు? బిహార్ ఎన్నికలకు ముందు వారికి కనబడిన మత అసహనం ఎన్నికల తరువాత ఆకస్మికంగా తగ్గిపోయిందా?” అని ప్రశ్నించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని దెబ్బతీయడానికే కొన్ని శక్తులు ఈ కుట్ర పన్నాయని, ఒక పద్ధతి ప్రకారం దానిని అమలు చేసి చివరికి విజయం సాధించాయని అనుపమ్ ఖేర్ అన్నారు. జమ్మూలోని ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి అనుపమ్ ఖేర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రశ్నలు అడిగారు. బిహార్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మత అసహనం గురించి మాట్లాడటం తగ్గించేసాయి. అలాగే ప్రముఖులు తమ అవార్డులను వాపసు చేయడం మానేశారు. అయితే ఈ మార్పులని నేటికీ బీజేపీ నేతలు గుర్తించలేకపోవడం కాంగ్రెస్ దాని మిత్రపక్షాల అదృష్టంగా చెప్పుకోక తప్పదు. కానీ చివరికి అనుపమ్ ఖేర్ ఈ ఊహాజనితమయిన మత అసహనం వెనుక అసలు రహస్యాన్ని బయటపెట్టారు. బిహార్ ఎన్నికలలో గెలవడం కోసం రాజకీయపార్టీలు ఇంత నీచానికి దిగజారడం చాలా దారుణం. అవి తమ స్వార్ధ రాజకీయాల కోసం చేసిన దుష్ప్రచారం వలన యావత్ ప్రపంచ దేశాల ముందు భారత్ తలదించుకొనే పరిస్థితి ఏర్పడింది.