‘శతమానం భవతి’ సినిమా కోసం తొలిసారి జోడీ కట్టారు శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు మరోసారి వీరిద్దర్నీ జంటగా వెండి తెరపై చూడబోతున్నాం. శర్వానంద్ కథానాయకుడిగా సంపత్‌నంది దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈచిత్రంలో కథానాయికగా అనుపమని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఇదో పిరియాడిక్ యాక్షన్ డ్రామా. మేలో సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ వేశారు. దాదాపు 40 శాతం షూటింగ్ అక్కడే జరుగుతుంది. సినిమా ప్రారంభానికి ముందు ఓ స్పెషల్ వీడియో విడుదల చేసే అవకాశం ఉంది. 2021లో ‘సిటీమార్’ తరవాత సంపత్ నంది దర్శకత్వం వహించే సినిమా ఇదే. మధ్యలో ‘ఓదెల 2’ అనే చిత్రానికి ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. సాయిధరమ్ తేజ్‌తో ‘గాంజా శంకర్’ అనే సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని అనుకొన్నారు. కానీ అది అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ‘గాంజా శంకర్’ ఎప్పటికైనా తీస్తానని సంపత్ ధీమాతో ఉన్నారు. శర్వానంద్‌తో సంపత్ నంది సినిమా అనగానే అంతా ఇది ‘గాంజా శంకర్’ కథే అనుకొన్నారు. కానీ శర్వా కోసం సంపత్ కొత్త కథ రాసుకొన్నారు. ‘గాంజా శంకర్’ ఎప్పుడు మొదలైనా అది సాయిధరమ్ తోనే అని టాక్.