ఈతరం కథానాయికలు చాలా తెలివైన వాళ్లు. తమ కెరీర్ బాలెన్స్‌లో ఉండేట్టు చూసుకుంటున్నారు. మంచి పాత్రలు వచ్చినప్పుడు త్యాగాలు చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అలాగని కమర్షియల్ పంథాకు దూరం కావడం లేదు. ఎక్కడి నుంచి వచ్చినా… తెలుగు భాష నేర్చుకుని, తెలుగు సినిమా వాతారణానికి తగ్గట్టుగా మారిపోయి, తెలుగు సినిమా హీరోయిన్లుగా చలామణీ అయిపోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ కూడా అంతే. ఈ మలయాళ కుట్టీ… ఇప్పుడు అచ్చమైన తెలుగమ్మాయి అయిపోయింది. తెలుగులోనే మాట్లాడుతోంది. ప్రస్తుతం ‘తేజ్ ఐ లవ్ యూ’లో నటించింది. శుక్రవారం విడుదల అవుతున్న ఈ సినిమా గురించి అనుపమతో చిట్ చాట్.
హాయ్ అనుపమ…
హాయ్..
తెలుగు బాగా మాట్లాడుతున్నారు. తెలుగు సినిమాలు చేస్తున్నప్పుడు తెలుగులోనే మాట్లాడాలని పట్టుపట్టారా?
నాకు తెలుగు ఇంత బాగా వచ్చిందంటే కారణం… త్రివిక్రమ్ గారే. ఆయనే నాకు తెలుగు నేర్పారు. అ.ఆ సమయంలో.. నాకు తెలుగు ఏమాత్రం వచ్చేది కాదు. చుట్టుపక్కల వాళ్లు గల గల తెలుగు మాట్లాడుతుంటే పిచ్చి చూపులు చూసేదాన్ని. ఆ మాటకు అర్థమేంటి? ఈ మాటకు అర్థమేంటి? అని త్రివిక్రమ్‌గారిని అడిగేదాన్ని. ఆయన ఓపిగ్గా సమాధానం చెప్పేవారు. నేనుండేది తెలుగు సినిమాల్లోనే అని డిసైడ్ అయ్యాక.. తెలుగు సినిమాలు ఎక్కువగా చూడడం మొదలెట్టా. అలా తెలుగు వచ్చేసింది.
కథానాయికగా చేస్తూనే `అ.ఆ`లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు కూడా ఒప్పేసుకుంటున్నారు. కారణం ఏమిటి?
నా తొలి ప్రాధాన్యం కథకు మాత్రమే. ఆ తరవాతే నా పాత్ర. నేను తెరపై ఎన్ని నిమిషాలు కనిపిస్తాను? అనే విషయం పెద్దగా ఆలోచించను. నటిగా పేరు తెచ్చుకోవడానికి ఒక్క మంచి సన్నివేశం సరిపోతుంది. అ.ఆలో నేను కనిపించింది రెండు సన్నివేశాల్లోనే. కానీ ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. ఉన్నది ఒకటే జిందగీ సినిమా కూడా అంతే కదా? ఫస్టాఫ్ తరవాత నేనసలు కనిపించను. కానీ ఆ సినిమా నాకు చాలా సంతృప్తినిచ్చింది.
కథానాయికల మధ్య పోటీ పెరిగిపోయింది కదా?
పోటీ ఉంది.. కాదనను. కానీ ఇది చాలా ఆరోగ్యకరమైన పోటీ. నాతో పాటు నటించిన మిగిలిన వాళ్ల సినిమాలూ చూస్తున్నా. మహానటిలో కీర్తి సురేష్ చాలా అద్భుతంగా చేసింది. సమ్మోహనంలో అదితి రావు హైదరీ చక్కగా నటించింది. రంగస్థలంలో సమంత గురించి చెప్పక్కర్లెద్దు.వీళ్లంతా నాకు ఎప్పటికప్పుడు స్ఫూర్తినిస్తుంటారు.
నిజానికి ఆ సినిమా మీరే చేయాలి కదా? మీ చేతుల్లోంచి ఎలా జారిపోయింది?
రామలక్ష్మి పాత్రలో నటించే అవకాశం నాకే వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయా. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఆ పాత్రలో సమంత అద్భుతంగా నటించింది. నాకంటే.. తనే న్యాయం చేయగలదు అనిపించింది. ఈ సినిమా చూశాక సుకుమార్ గారికి ఫోన్ చేసి ఈ విషయమే చెప్పా.
ఇంతకీ తేజ్‌లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
ఇప్పటి వరకూ నేను చేయని పాత్ర ఇది. పరిణితితో కూడిన పాత్ర అని చెప్పొచ్చు. అందిరి మీదా ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటా.కొంచెం టెంపరి తనం కూడా ఉంటుంది.
కరుణాకరన్ సినిమా కాబట్టే ఒప్పుకున్నారా?
కరుణాకరన్ చాలామంచి దర్శకుడు. తొలి ప్రేమ, డార్లింగ్ సినిమాల్ని చూశా. కథానాయికల్ని ఆయన చాలా గొప్పగా చూపించారు. వాళ్ల పాత్రలు చాలా అందంగా రాసుకున్నారు. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నా. అయితే నా పాత్ర కూడా నాకు బాగా నచ్చింది. ఈమధ్య కాలంలో నేను చేసిన పూర్తి స్థాయి కథానాయిక పాత్ర ఇదే అనుకోవాలి.
సాయిధరమ్‌తో స్టెప్పులు వేయగలిగారా?
ఆ విషయంలో కాస్త కష్టపడ్డా. తేజ్ ఎలాంటి స్టెప్ అయినా చాలా ఈజీగా చేసేస్తున్నాడు. నాకేమో తేజ్‌ని చూస్తే కంగారొచ్చేది. అందుకే డాన్స్ మాస్టర్ సహాయంతో ఆ స్టెప్పుల్ని ముందుగా నేర్చుకున్నా. నాకు క్లాసికల్ డాన్స్ ఉంది. ఇప్పటి వరకూ… మామూలు డాన్సులే చేశా. ఇలాంటి డాన్సులు చేయలేదు.
ఎప్పుడూ ఇలా పక్కింటి అమ్మాయిలానే కనిపిస్తారా, గ్లామర్ పాత్రలకు మీరు వ్యతిరేకం అనుకోవచ్చా?
అలాంటిదేం లేదు. నన్ను అంతా పక్కింటి అమ్మాయి పాత్రల్లోనే చూడాలనుకుంటున్నారు. ప్రయోగాత్మక పాత్రలకు, గ్లామర్ పాత్రలకు నేను సిద్ఢమే. గ్లామర్ అనేది మనం వేసుకునే దుస్తుల్లో ఉందనుకోవడం పొరపాటు. ఆ దృక్పథం మారాలి. నేనైతే ప్రతీ సినిమాలోనూ అందంగా కనిపించాలని ప్రయత్నిస్తుంటా.
ఇప్పుడు చేస్తున్న సినిమాలేంటి?
రామ్‌తో `హలో గురు ప్రేమ కోసమే`లో నటిస్తున్నా. నాకు దొరికిన మరో మంచి అవకాశం అది. కన్నడలో ఓ సినిమా చేస్తున్నా.
ఓకే. ఆల్ ద బెస్ట్
థ్యాంక్యూ