బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ చెప్పినంత పని చేశారు. ఆయన బాలీవుడ్ కి గుడ్ బై చెప్పేశారు. ఇటివలే ఆయన ఓ ఇంటర్వ్యూలో ‘బాలీవుడ్ ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఇక్కడ నిర్మాతలకు కొత్తదనంపై నమ్మకం పోయింది. అందుకే నేను బయటకు వెళ్లాలని అనుకుంటున్నా. మంచి వాతావరణం కోసం సౌత్ ఇండస్ట్రీకి వెళ్లిపోతాను’’ అని చెప్పారు. తాజాగా ఆయన బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు.
అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్. ఆయన జర్నీ చాలా విలక్షణమైనది. అసిస్టెంట్ రైటర్ గా కెరీర్ మొదలుపెట్టారు. రామ్ గోపాల్ వర్మతో జర్నీ చేశారు. సత్య లాంటి సినిమాల్లో అనురాగ్ కాంట్రీబ్యుషన్ చాలా వుంది.
డైరెక్టర్ గా తీసిన మొదటి సినిమా పాంచ్ రిలీజ్ కాలేదు. బ్లాక్ ఫ్రై డే లాంటి వివాదస్పద సినిమాలతో ఫిల్మ్ మేకింగ్ తనకంటూ ఓ మార్క్ ని క్రియేట్ చేశారు. ఆ సినిమా బ్యాన్ చేస్తే.. ప్రతి షాప్ కి తిరిగి డీవీడీలు అమ్మారు. ‘దేవదాస్’కి తనదైన మోడరన్ భాష్యం చెబుతూ అనురాగ్ తీసిన ‘దేవ్ డి’ చాలామంది ఫిల్మ్ మేకర్స్ కి ఫేవరేట్. తర్వాత గ్యాంగ్స్ అఫ్ వాసేపూర్ ఆయన విపరీతమైన పాపులారిటీ తెచ్చింది.
అయితే ఫిల్మ్ మేకర్ గా తను నమ్మి చేసిన కొన్ని సినిమాలు దెబ్బకొట్టాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తీసిన ముంబై వల్వేట్ చాలా నిరాశపరిచింది. ఈ సినిమా నష్టాలు పూడ్చడానికి తక్కువ బడ్జెట్ తో రామన్ రాఘవన్ చేశారు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలకు చెప్పుకోదగ్గ పేరు రాలేదు. కొన్నాళ్ళు దర్శకత్వం పక్కన పెట్టి నటుడిగా మారారు. ఒకదశలో బాలీవుడ్ పరిశ్రమ నుంచి నిరాదరణ కూడా ఎదురుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆ ఇండస్ట్రీనే వీడారు.
అనురాగ్ ఒరిజినల్ వాయిస్ వున్న ఫిల్మ్ మేకర్. ఆయనకి ఉండాల్సిన ఆడియన్స్ ఎప్పుడూ వుంటారు. కాకపొతే అనురాగ్ ఇప్పటివరకూ నార్త్ టచ్ వున్న కథలనే తీశారు. ఆ కథలు కూడా చాలా రూటెడ్ గా వుంటాయి. సౌత్ బ్యాక్ డ్రాప్ లో కూడా అలాంటి రూటెడ్ కథలకి ప్రేక్షకులు ఆదరణ వుంటుంది. ఆయన ఇక్కడ నిర్మాతలని ఒప్పించగలిగి ఓ హిట్టు కొడితే మార్గం సుగమం అవుతుంది. మరి ఆయన సౌత్ జర్నీ ఎలా సాగుతుందో చూడాలి.