గంటల్లెక్కన పారితోషికం తీసుకొనే వాళ్లలో ఇన్నాళ్లూ హాస్య నటులే ఉంటారని అనుకొన్నాం. ఇప్పుడు దర్శకులు కూడా చేరిపోయారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన ఛార్జ్ గంటకు రూ.5 లక్షలని డిక్లేర్ చేసేశాడు. అయితే.. దర్శకుడిగా కాదు. తనతో గంట మాట్లాడడానికి చెల్లించాల్సిన ఫీజు అది. ఓ దర్శకుడు తన ఛార్జ్ బహిరంగంగా వెల్లడించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయిపోయింది. విషయం ఏమిటంటే…?!
ముంబైలో పనులు తక్కువ, మీటింగులు ఎక్కువ. కొత్తగా సినిమాల్లోకి రావాలనుకొన్నవాళ్లు, లేదంటే పెద్ద ప్రాజెక్టులు ప్లానింగులో ఉన్నవాళ్లు అనురాగ్ కశ్యప్లాంటి అనుభవజ్ఞుల్ని కలిసి, వాళ్ల సలహాలూ, సూచనలు అందుకొంటుంటారు. అనురాగ్ కూడా ఇది వరకు అలాంటి మీటింగులకు వెళ్లినవాడే. అయితే తనని ఇకపై అలాంటి సమావేశాలకు పిలిచేవాళ్లు పావుగంటకు లక్ష, అరగంటకు 2 లక్షలు, గంటకు 5 లక్షలు చెల్లించాలని ఓ ఛార్జ్ షీట్ సోషల్ మీడియాలో పెట్టాడు. ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చి అలసిపోయానని, తన టైమ్ చాలా వేస్ట్ చేసుకొన్నానని, ఇకపై ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయబోనని బహిరంగంగానే చెప్పేశాడు అనురాగ్ కాశ్యప్. ఇలా ఓ దర్శకుడు.. తనతో మాట్లాడాలంటే ఫీజు చెల్లించాల్సిందేనని బోల్డ్ గా ప్రకటించడం వింతే. అయినా అనురాగ్ కశ్యప్ స్టైలే అంత. ఆయన కథలే కాదు, మాటలూ ఇంతే బోల్డ్ గా ఉంటాయి. ఇకపై అనురాగ్ అప్పాయింట్ మెంట్ కావాలంటే లక్షల చెక్ని కూడా రెడీ చేసుకోవాల్సిందే.