హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. అదే సమయంలో నాగార్జున కూడా వచ్చారు. వీరిద్దరితో కలిసి అనురాగ్ ఠాకూర్ విందు భేటీ నిర్వహించారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని … మెగా కాంపౌండ్ చెబుతోంది. అయితే ఇటీవల బీజేపీ.. చిరంజీవిని దువ్వడానికి తన వంతు ప్రయత్నం చేస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ టాస్క్ అనురాగ్ ఠాకూర్ తీసుకున్నారని భావిస్తున్నారు. చిరంజీవిని బీజేపీ ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా చూసేందుకు ప్రయత్నిస్తోంది. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో మోదీ .. చిరంజీవి తనకు ఎంతో ఆప్తమిత్రుడన్నట్లుగా సంభాషించారు. తర్వాత కూడా ఈ పాజిటివ్ ఫీలింగ్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు అది ఇంకాస్త ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోందిని అంటున్నారు.
ఇటీవల చిరంజీవికి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ అవార్డు ఇచ్చారు. గోవాలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ సభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లే.. రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా అని అడిగేశారు. సినిమాల్లోకి వచ్చి హిట్ అయినట్లే..రెండో సారి రాజకీయాల్లోకి వస్తే సూపర్ హిట్ అవుతారనే ఉద్దేశంలో ఆయన వేదికపైనే అడిగారు అయితే చిరంజీవి మాత్రం తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రశ్నే లేదని తేల్చేశారు. తాను ఇక సినిమాలకే అంకితమని స్పష్టం చేశారు.
చిరంజీవి తన సోదరుడికి మద్దతుగా మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ ఉన్నత స్థానానికి వెళ్తుందని చెబుతున్నారు. అందుకే.. ఇటీవలి కాలంలో వైసీపీ నేతలు కూడా ఆయనను దూరం పెడుతున్నారు. అయినా సరే చిరంజీవి ఏ మాత్రం తగ్గడం లేదు. ఆయన బీజేపీలోకి వస్తే ఏపీలో ఓ బలమైన ఫోర్స్‌గా మారవచ్చని బీజేపీ అనుకుంటోంది. ఆయనసోదరుడు బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ.. మిత్రపక్షాన్ని బలపర్చడం బీజేపీకి ఇష్టం ఉండదు. ఆ పార్టీని విలీనం చేయాలని కోరుతున్నా.. పవన్ నిరాకరిస్తున్నారు. చిరంజీవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారో రారో కానీ.. బీజేపీ మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తోందని అనురాగ్ ఠాకూర్ చిరంజీవి ఇంటికి వెళ్లడంతో భావించవచ్చంటున్నారు.