బాహుబలి తరవాత.. అనుష్క మరీ నల్లపూస అయిపోయింది. `భాగమతి` తప్ప మరే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శబ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివచ్చింది. అనుష్కకి సినిమా అవకాశాలు లేవా? వచ్చినా చేయడం లేదా? అనే అనుమానాలు రేకెత్తాయి. అనుష్క కావాలని సినిమాలు తగ్గించుకుంటోందని ప్రచారం జరిగింది. అనుష్క కూడా ఇప్పుడు అదే నిజం అంటోంది. “అవును.. నాకు గ్యాప్ రాలేదు. తీసుకున్నా. బాహుబలికి ముందు నేనెప్పుడూ విరామం తీసుకోలేదు. అందుకే కావాలని సినిమాలు తగ్గించుకున్నా. ఇప్పుడు రెండు కొత్త సినిమాలు ఒప్పుకున్నా. వాటి వివరాలు త్వరలో చెబుతా” అంటోంది అనుష్క.
తాను నటించిన ‘నిశ్శబ్దం’ ఓటీటీ వేదిక ద్వారా అక్టోబరు 2న విడుదల అవుతోంది. ఈ సినిమాపై, తన పాత్రపై చాలా నమ్మకాలు పెట్టుకుంది స్వీటీ. “ఈసినిమాలో నా పాత్ర పేరు సాక్షి. నాకు మాటలుండవు. వినిపించదు కూడా. మూగ భాషలోనే సంకేతాలు ఇవ్వాల్సివచ్చింది. అందుకోసం అమెరికాలో రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. ఆ శిక్షణ నాకెంతో ఉపయోగపడింది. సినిమా అంతా నా పాత్ర చుట్టూనే తిరగదు. కొన్ని కీలకమైన పాత్రల్లో నాదొకటి” అంది. ఓటీటీలో ఈ సినిమా విడుదల కావడంపై స్పందిస్తూ.. “ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటీటీ లో విడుదల చేయడమే మంచిది. నాకూ ఓటీటీ కొత్తే. సినిమా అంటే థియేటర్ లోనే చూడాలి అనుకుంటాను. నాకూ అదే ఇష్టం. కానీ ప్రపంచం మారుతోంది. ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడుతున్నారు. త్వరలో పాన్ ఇండియా సినిమాలు సైతం ఓటీటీలో విడుదల అవుతాయి. అంతగా ఓటీటీలు ప్రభావం చూపిస్తాయి” అని చెప్పుకొచ్చింది.